ఇసుకకు కటకట
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

ఇసుకకు కటకట

రవాణా పేరుతో ధరల వాత
ఈనాడు, అమరావతి

నిన్నటి వరకు బయటి వ్యక్తులకు ఇసుక లేదన్నారు. ఒక్క జగనన్న కాలనీలకు మాత్రమే సరఫరా అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం జగనన్న కాలనీలకు సరఫరా లేదు. బయటి వ్యక్తులకు మాత్రమే. నేరుగా నిలువ కేంద్రానికి వచ్చి నగదు చెల్లించి తీసుకెళ్లవచ్చు. కారణం ప్రభుత్వం పెంచిన ధరలకే ఇసుక విక్రయించుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో బయటి వ్యక్తులకు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో జిల్లాలో ఇసుక నిలువలు తరిగిపోయాయి. మరో వారం రోజుల వరకే సరిపోతాయి. జగనన్న కాలనీల నిర్మాణాల్లో పెద్దగా పురోగతి లేకపోవడంతో అక్కడ ఇసుక డిమాండ్‌ తక్కువగా ఉందని చెబుతున్నారు. నిలువ కేంద్రాల పేరుతో ఇసుక ధరలు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. రీచ్‌ల నుంచి నిలువ కేంద్రానికి తరలించినందున ఈ పెంచిన ధరలు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు, కొన్ని ప్రాంతాల్లో నేరుగా నగదు చెల్లింపులు స్వీకరిస్తున్నారు. గత నెలలో జిల్లాలో 11.25లక్షల టన్నుల ఇసుక నిలువ చేశారు. ఒకే ఒక్క రోజులో 5.14లక్షల టన్నులు విక్రయించారు. ప్రస్తుతం 6.11లక్షల టన్నులు నిలువ ఉన్నట్లు చూపిస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే నిలువ ఇసుకగా చూపిస్తున్నారు. విక్రయాలు మాత్రం ఇటీవల ప్రారంభించారు. నిలువ కేంద్రాల వద్ద కూడా నాణ్యమైన ఇసుక లభ్యం కావడం లేదు. ఇబ్రహీంపట్నం వద్ద ఇసుక నిలువ కేంద్రంలో సిల్ట్‌తో కూడిని ఇసుకను విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది కృష్ణా నదికి నిరంతరాయంగా వరదలు వస్తున్నాయి. దీంతో ఇసుక నిలువ చేయలేకపోయారు. గతేడాది ప్రభుత్వం ఆధ్వర్యంలో యంత్రాంగం భారీగా నిలువ చేసి గుంటూరు జిల్లాకు సరఫరా చేసింది. ఈ ఏడాది గుత్త సంస్థ నిలువలు చేయలేదు. ఇటీవల కంచికచర్ల సమీపంలో కృష్ణా నదిలో దాదాపు 150 లారీలు, ట్రాక్టర్లు వరదలో చిక్కుకున్న ఘటన తెలిసిందే. రొయ్యూరు వద్ద అసలు విక్రయాలే లేవు. సాధారణ టన్ను ధర రూ.475 ఉన్న రేవుల్లో ఇసుక నిలువలు లేవు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు లేవు. కానీ కీసర, ఇబ్రహీంపట్నం, మైలవరంలో నిలువ చేసిన ఇసుకకు భారీగా వసూలు చేస్తున్నారు. నూజివీడు వద్ద ఏకంగా టన్ను రూ.810 చొప్పున వసూలు చేస్తున్నారు. మైలవరానికి టన్ను రూ.725 చొప్పున వసూలు చేస్తున్నారు. మొదట ఈ కేంద్రాల్లో జగనన్న కాలనీలకు మాత్రమే సరఫరా అంటూ బయటి వ్యక్తులకు ఇసుక విక్రయాలు జరపలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే టన్ను రూ.650 చొప్పున వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం టన్ను రూ.475 మాత్రమే వసూలు చేయాలి. నిలువ కేంద్రాలకు ఇసుక రవాణా చేశామనే సాకుతో ధర పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నూజివీడు పరసరాల్లో వాగుల నుంచి ఇసుక లభ్యం అవుతోంది. కానీ టన్ను రూ.810 వసూలు చేస్తున్నారు. తిరువూరు సమీపంలోనూ ఇసుక నిలువలు వాగుల్లో ఆపారం. అయినా మైలవరం నుంచి తీసుకెళ్లాలని నిబంధన పెట్టారు. దీంతో ఈ ప్రాంతం వారికి భారంగా మారింది. విజయవాడ నగర వాసులు ఇబ్రహీంపట్నం, కీసర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇసుక ధరతో పాటు రవాణా భారంగా మారింది. ఇప్పుడిప్పుడే భవన నిర్మాణాలు ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో ఇసుక లభ్యత లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని నిర్మాణదారులు వాపోతున్నారు. జిల్లాలో ఇసుక కాంట్రాక్టు సంస్థకు మొత్తం 58 రేవులు అప్పగించారు. ప్రస్తుతం 11 రేవుల వద్ద ఇసుక తవ్వకాలు జరిపినట్లు చెబుతున్నారు. నిలువ చేయడంలో సంస్థ తగిన శ్రద్ధ వహించలేదని నిర్మాణదారులు వాపోతున్నారు. కృష్ణా నదికి పూర్తిగా వరద తగ్గిన తర్వాత మళ్లీ తవ్వకాలు ప్రారంభించనున్నారు. ఇసుక నిలువలు తగ్గిన మాట వాస్తవమేనని గనుల శాఖ డీడీ సుబ్రహ్మణ్యం చెప్పారు. అడిగిన వారందరికీ ఇసుక ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం విక్రయాలకు అనుమతి ఇచ్చిందని, నిలువ కేంద్రం, ఇసుక రేవుల దూరాన్ని బట్టి ధర నిర్ణయించారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని