దాడి ఘటన హేయం
eenadu telugu news
Updated : 20/10/2021 06:26 IST

దాడి ఘటన హేయం

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ఇంటిపై దాడి ఘటన హేయమని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని మంగళవారం పలువురు సందర్శించి మాట్లాడారు.

నిరంకుశ ధోరణికి నిదర్శనం
- నాగూల్‌ మీరా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌

రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చూడలేదు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే భౌతిక దాడులకు సిద్ధపడతారా?, రాజకీయంగా మాట్లాడితే ఇళ్ల పైకి వచ్చి ఆడవాళ్లపై దాడులు చేసే సంస్కృతి ఏంటి? ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇది పరాకాష్ట. పట్టాభి ప్రశ్నించే గొంతుగా మారగా, అతని నోరు నొక్కే ప్రయత్నంలోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఈ దాడులను ఖండించాలి.


ప్రజాస్వామ్యం ఖూనీ

- బచ్చులు అర్జునుడు, ఎమ్మెల్సీ
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే ‘భస్మాసుర హస్తం’ మాదిరిగా ఆయనకు జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. దౌర్జన్యాలు మేమూ చేయగలం. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెదేపా ఇలాంటి వాటికి పాల్పడదు. పార్టీలకు అతీతంగా ప్రతి కార్యకర్త ఇటువంటి దాడులను వ్యతిరేకించాలి.


రాష్ట్రంలో చీకటి పాలన
- గద్దె అనూరాధ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌

రాష్ట్రంలో తెదేపా నాయకులపై వరుస దాడులకు పాల్పడటం అమానూషం. రాష్ట్రంలో వైకాపా చీకటి పాలనకు తెరతీసింది. ప్రజలు ఇచ్చిన తీర్పునూ అగౌరవ పరుస్తూ బిహార్‌ను తలపించేలా కిరాయి గుండాలతో మూకుమ్మడి దాడుల చేయడం సమాజానికి సిగ్గుచేటు.


ప్రజలే బుద్ధి చెబుతారు
- చెన్నుపాటి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి, తెదేపా  

రాజకీయంగా ఎదుర్కోలేక, తెదేపా నాయకులను భయపెట్టే విధంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇది పిరికిపంద చర్య. మా నాయకుడు ఇదే ధోరణి అవలంబిస్తే రాష్ట్రంలో జగన్‌ పాదయాత్ర చేసేవారా?  అధికారం శాశ్వతం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారే తగిన సమయంలో బుద్ధి చెబుతారు.


అమానుషం
- జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్‌

పట్టాభిరాం ఇంట్లో లేని సమయంలో దండుపాళ్యం బ్యాచ్‌గా గూండాలు ఇంటిపై దాడి చేయడం అమానుషం. డ్రైవర్‌ మెడపై కత్తిపెట్టి ఇంట్లో సామగ్రి అన్నింటినీ ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు.  పట్టాభి కుమార్తె బిక్కుబిక్కుమంటూ బాత్రూమ్‌లో కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ దాడిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలి.


ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : మండలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: తెదేపా కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై వైకాపా నాయకులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ఈ రోజు చీకటి రోజు అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైకాపా వ్యూహాత్మకంగా దాడులు చేసిందని తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదని, పోలీసుల వైఫల్యమే కాకుండా, వారి మద్దతుతో జరిగిందనే భావన ప్రజలకు కలిగించారన్నారు.  ప్రతిపక్షాలను భయపెట్టే చర్యలను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. బుధవారం చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని