తెదేపా కార్యకర్తలు, మహిళలపై పెట్రోలు చల్లిన దుండగులు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

తెదేపా కార్యకర్తలు, మహిళలపై పెట్రోలు చల్లిన దుండగులు

జాతీయ రహదారిపై కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత

ఈనాడు-అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయానికి సమీపంలోని జాతీయరహదారిపై మంగళవారం రాత్రి కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న మహిళలు, పార్టీ కార్యకర్తలపై పెట్రోలు తుంపర్లుగా వచ్చి పడటంతో.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  తెదేపా కార్యాలయంపై దాడిని నిరసిస్తూ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం రహదారిని దిగ్బంధించి తర్వాత విరమించారు. విలేకరుల సమావేశం తర్వాత చంద్రబాబు.. మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలతో పాటు రాజధాని ప్రాంత రైతులు అక్కడకు చేరుకున్నారు. దాడిని నిరసిస్తూ మరోమారు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. రహదారిని రెండు వైపులా దిగ్బంధించారు. సీఎం డౌన్‌ డౌన్‌ అనే నినాదాలు చేశారు. ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అధిక సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేశారు. తెదేపా కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన కొనసాగించారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు.. వారిపై పెట్రోలు చల్లారు. తెదేపా నాయకుడు నాదెండ్ల బ్రహ్మంతో పాటు పలువురు మహిళలపైనా ఇది పడింది. అక్కడున్న వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది దుండగుల పనేనని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలతో పాటు పలువురు గాయపడ్డారు. తర్వాత పోలీసులు వారిని బలవంతంగా వారిని అక్కడ నుంచి పక్కకు పంపి.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని