ప్రాణదాతలకు ప్రోత్సాహకం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

ప్రాణదాతలకు ప్రోత్సాహకం

జీరో అవర్‌లో సేవలు అందించే వారికి రూ.5వేలు నగదు, జ్ఞాపిక
సత్తెనపల్లి, న్యూస్‌టుడే

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జిల్లాలో రోజుకు సగటున ఆరు ఘటనలు జరుగుతుండగా ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో నలుగురు గాయపడుతున్నారు. రోడ్డు ప్రమాద మరణాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. మరణాల్లో ఎక్కువగా జీరో అవర్‌లో వైద్యసేవలు అందనివే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రాణదాతలకు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి కొడిగట్టే ప్రాణాల్ని కాపాడే వారికి నగదుతో పాటు జ్ఞాపిక అందించేలా ఈ నెల 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘గుడ్‌ సమారిటన్‌’ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది.

2019లో గుంటూరు జిల్లాలో 2,208 ప్రమాదాలు చోటుచేసుకోగా 920 మంది మృతి చెందారు.. 2,278 మంది గాయపడ్డారు. 2020లో 1,828 ప్రమాదాలు నమోదు కాగా 819 మంది కన్నుమూశారు. 1,694 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసు రికార్డులకు ఎక్కని ప్రమాదాలు మరికొన్ని ఉంటున్నాయి. వినుకొండ, చిలకలూరిపేట, పెదకాకాని, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు నమోదయ్యాయి.

జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే 229 ప్రాంతాల్ని బ్లాక్‌స్పాట్లుగా రోడ్డు రవాణా, పోలీసు తదితర శాఖలు గుర్తించాయి.

చాలా మంది ప్రమాదం జరిగినప్పుడు 100, 108  అత్యవసర నంబర్లకు సమాచారం ఇవ్వాలని భావించినా పోలీసు కేసుల గొడవ మనకెందుకులే అని పక్కకు వెళ్లిపోతున్నారు. సమాచారం ఇచ్చిన వారికి పోలీసులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు జీరో అవర్‌లో సేవలందేలా చేసిన వారికి రూ.5 వేలు నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ప్రాణాల్ని కాపాడిన వారికి రూ.లక్ష నగదుతో పాటు జాతీయ స్థాయిలో పురస్కారం ఇవ్వాలని యోచన చేసింది. జిల్లాకు రూ.5 లక్షలు చొప్పున నగదు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది.  


మూడేళ్లలో 20 మంది ప్రాణాలు కాపాడి

- అమృతపు గణేష్‌, సత్తెనపల్లి

ప్రైవేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తూ రోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటా. నా కళ్ల ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వెంటనే 108తో పాటు పోలీసులకు సమాచారమివ్వడం అలవాటుగా మారింది. గత మూడేళ్లలో 20 మంది ప్రాణాలు కాపాడా. జీరో అవర్‌లో చాలా మందికి సేవలందించా. అత్యవసర సమయాల్లో అందించిన సేవలకు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నా.


చైతన్యం పెంపొందిస్తాం..

- మీరాప్రసాద్‌, డీటీసీ, గుంటూరు
రోడ్డు ప్రమాద మరణాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన గుడ్‌ సమారిటన్‌ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తాం. మార్గదర్శకాలు రావాల్సి ఉంది. జిల్లాలో ప్రాణదాతల్ని ప్రోత్సహించి రోడ్డు ప్రమాద మరణాల్ని గణనీయంగా తగ్గిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని