శ్మశానవాటిక సమస్యకు త్వరలోనే పరిష్కారం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

శ్మశానవాటిక సమస్యకు త్వరలోనే పరిష్కారం

ముప్పాళ్లలో ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది
రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

తహసీల్దారు యశోదకు సూచనలు చేస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: ముప్పాళ్లలో ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. కమిషన్‌ సభ్యులు, అధికారులతో కలిసి మంగళవారం ముప్పాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముప్పాళ్లలో అన్ని కులాలు, మతాల వారికి అందమైన గోడలతో శ్మశానవాటికలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ కాలనీ వాసులు 60 ఏళ్లుగా శ్మశానవాటిక లేదని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదనే విషయాన్ని పక్షం రోజుల క్రితం కాలనీకి చెందిన కందుల జార్జి కమిషన్‌ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే కమిషన్‌ సభ్యుడిని పంపించి సమస్యను తెలుసుకున్నామని చెప్పారు. ఎస్సీ కమిషన్‌ ఏర్పాటైన తరువాత తొలి క్షేత్ర పరిశీలన సమస్య ఇదేనని.. దీన్ని పరిష్కరించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ‘రోడ్డు అంచులో ఖననాలు చేయడం..కొందరు వాటిని ఆక్రమించడం, ఆచారం ప్రకారం సమాధుల పండగ కూడా చేసుకోలేని స్థితిలో ఎస్సీలు ఉండటం బాధ కలిగిస్తోందని తెలిపారు. గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో నడకకు సైతం ఇబ్బందికరమైన ప్రాంతంలో 2.82 ఎకరాల్లో పోరంబోకు భూమి ఉన్నట్లు పరిశీలనలో గుర్తించామని చెప్పారు. అందులో ఎకరా భూమిని ఎస్సీలకు శ్మశానవాటిక ఏర్పాటుకు కేటాయించాలని కోరగా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని జేసీ దినేష్‌కుమార్‌ చెప్పారన్నారు. అధికారులతో మాట్లాడి శ్మశానవాటిక సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్సీలకు మరుభూమి కల్పనకు ఎవరైనా అడ్డు వస్తే కమిషన్‌ విస్తృత అధికారాలు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. తొలుత ఎస్సీ కాలనీలోని చర్చిలో స్థానికులతో సమావేశమయ్యారు. శ్మశానవాటిక లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు అంచులో ఖననాల్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుంట పోరంబోకు భూమిని పరిశీలించి అక్కడే జేసీతో మాట్లాడారు. మొత్తం కుంటభూమిలో ఎకరం మేర శ్మశానవాటికకు కేటాయించి శుక్రవారం లోపు హద్దులు వేస్తామని జేసీ ఛైర్మన్‌కు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.బసవరావు, ఎం.ప్రకాశ్‌, కమిషన్‌ కార్యాలయ పర్యవేక్షకుడు శివకుమార్‌, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దారు యశోద, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, ఎస్సై పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని