చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

చిత్ర వార్తలు

కరకట్ట భద్రమేనా?

రాజధాని అమరావతిలోని తాళ్లాయపాలెం సమీపంలో డ్రెడ్జింగ్‌ పనులు జరుగుతున్నాయి. కరకట్టకు, కృష్ణా నదికి మధ్యలో సీఆర్‌డీఏ ఆధీనంలో ఉన్న భూముల్లో ఇసుక డంప్‌ చేయడానికి, నిల్వ చేయడానికి కట్టలు పోసి ఏర్పాట్లు చేశారు. డ్రెడ్జింగ్‌ ద్వారా వెలికి తీసిన ఇసుకను గొట్టాల ద్వారా అందులో నిల్వ చేస్తున్నారు. నది పక్కన ఇసుక నిల్వ చేయడం వల్ల నీరు చేరి కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కరకట్ట బలహీనపడి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులు కొద్ది రోజుల కిందట నిరసన వ్యక్తం చేశారు. కరకట్ట పక్కన ఇసుక డంప్‌ చేయడం వల్ల ముప్పు పొంచి ఉందని అన్నదాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఉండగా ఏ విధంగా పనులు చేపట్టారని నిరసన తెలిపారు. అయినప్పటికీ¨ గుత్తేదారు సంస్థ నాలుగు రోజులుగా పనులు చేపట్టి ఇసుక తవ్వకాలు ప్రారంభించడం గమనార్హం.

- ఈనాడు, అమరావతి


ముప్పు తొలగలేదు.. మూలకు చేరాయి

రైన ఉష్ణోగ్రతలో టీకాలను నిల్వ ఉంచి, రవాణాకు ఉపయోగించే వ్యాక్సిన్‌ క్యారియర్లు(శీతలీకరణ పెట్టెలు) ఇవి. విజయవాడ ప్రభుత్వాసుపత్రి, జిల్లాలోని పలు కేంద్రాల్లోని టీకా శీతలీకరణ పెట్టెలను తీసుకొచ్చి సిద్ధార్థ మెడికల్‌ కళాశాల వెనుక భాగంలో ఇలా చెత్తలో పడేశారు. ఈ పెట్టెలను కరోనా టీకాకే కాదు, ఇతర టీకాలకు ఉపయోగిస్తారు. కొవిడ్‌ ముప్పు ఇప్పటికీ తొలగలేదు. ఇంకా టీకాలు వేస్తూనే ఉన్నారు. ఉపయోగకరమైన ఈ శీతలీకరణ పెట్టెలను ఇలా వృథాగా పడేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి


ప్రమాద సూచికలు ఈ మార్కర్‌ బాల్స్‌

కొండలు, లోయలు, నదులపై అధిక లోడు గల విద్యుత్తు తీగలు వెళ్లేటప్పుడు వాటిని తక్కువ ఎత్తులో వెళ్లే విమానాలు, హెలీకాప్టర్‌ పైలెట్లు గుర్తించేందుకు వీలుగా విజిబులిటీ మార్కర్‌ బాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి ఒకవైపు తెలుపు.. మరోవైపు ఎరుపు, పసుపు రంగుల్లో గుండ్రంగా ఉంటాయి. హెలీకాప్టర్లు, విమానాలు అధిక సామర్థ్యం గల విద్యుత్తు వైర్లను తాకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నుంచి విజయవాడ వైపు కృష్ణానదిపై వెళ్తున్న విద్యుత్తు తీగలపై కనిపించిన చిత్రాలివి.

- ఈనాడు, అమరావతి


ఇల్లు నిర్మించేదెలా?

వనిగడ్డలోని జగనన్న కాలనీ లేఔట్‌ వర్షం నీటితో నిండింది. మౌలిక సదుపాయాలు కల్పించి.. లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా ప్రభుత్వం మెరక చేసి అప్పగించాల్సి ఉంది. లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని మెరక చేయకపోవడంతో పక్కనే ఉన్న మండలిపురం లేఔట్‌లో పడిన వర్షం నీరు కూడా ఇందులోకి వచ్చి చేరుతోంది. ఇక్కడ ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

- న్యూస్‌టుడే, ఆవనిగడ్డ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని