దాడులతో ఉద్రిక్తం
eenadu telugu news
Published : 20/10/2021 06:21 IST

దాడులతో ఉద్రిక్తం

నేడు బంద్‌కు తెదేపా పిలుపు

తెదేపా కేంద్ర కార్యాలయం ఎదుట చింపేసిన ఫ్లెక్సీలు

ఈనాడు, విజయవాడ: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నివాసంపై అరాచకమూకల దాడి నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులకు నిరసనగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెదేపా ఆందోళనలు చేపట్టింది. రాస్తారోకోలు, ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేసింది. దాడి నేపథ్యంలో జల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో నేతల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. వైకాపా నేతల నివాసాల వద్ద బందోబస్తు పెంచారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి నేపథ్యంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉంటుందన్న ముందస్తు చర్యల్లో భాగంగా భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో వైకాపా, తెదేపా నేతల మధ్య పలు మండలాల్లో ఘర్షణలు జరిగాయి. ఎన్నికల ముందు, తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాడి ఘటనలపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు తెదేపా నేతలు విజయవాడ గురునానక్‌నగర్‌లోని పట్టాభి నివాసాన్ని పరిశీలించారు. వందల సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. పట్టాభి నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో ఏఆర్‌, టాస్క్‌ఫోర్సు, లాఅండ్‌ ఆర్డర్‌ పోలీసులు వచ్చారు. జిల్లా తెదేపా కార్యాలయం ఆటోనగర్‌లో ఉంది. అక్కడ పటమట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటన జరిగిన తర్వాత సీపీ బి.శ్రీనివాసులు టెలీకాన్ఫరెన్సులో పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యాలయాలు, నేతల నివాసాల వద్ద భద్రత పెంచాలని సూచించారు. కొన్నిచోట్ల ఏర్పాటు చేశారు. కొంత మంది నివాసాల వద్ద ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

విరిగిన ప్రధాన గేటు

రాస్తారోకోలు... ప్రదర్శనలు..

వైకాపా శ్రేణుల దాడుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. పలు మండలాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లాలోని నేతలు హుటాహుటిన పట్టాభి నివాసానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరారు. నందిగామలో తెదేపా నేతలు రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దాడిని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు సంయమనం పాటించాలని, బుధవారం శాంతియుతంగా బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. తిరువూరు, అవనిగడ్డ, నూజివీడు, గన్నవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జికొండూరు మైలవరం తదితర ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని