వెల్లువెత్తిన నిరసన
eenadu telugu news
Published : 20/10/2021 06:23 IST

వెల్లువెత్తిన నిరసన

పార్టీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై తెదేపా నాయకుల రాస్తారోకో

ఈనాడు, గుంటూరు: మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై మంగళవారం సాయంత్రం దాడి చేయడాన్ని నిరసిస్తూ, ఆ పార్టీ శ్రేణులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. రహదారులపైకి వచ్చి రాస్తారోకోలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెదేపా కార్యాలయంపై దాడి సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఎత్తిచూపుతున్న లోపాలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్న వైకాపా ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తెదేపా కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి చేసి రాష్ట్రంలో ఆరాచకాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా నేతలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. గుంటూరు నగరంలో జిల్లా పార్టీ కార్యాలయంపై వైకాపా వారు దాడికి వస్తారనే సమాచారంతో తెదేపా శ్రేణులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. జిల్లా కార్యాలయం గేటు ముందు ఆందోళన నిర్వహించారు. నరసరావుపేటలో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకో చేస్తూ తెదేపా నేతలు బైఠాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రహదారిలో తెదేపా నేతలు ధర్నా చేసి దాడులను ఖండించారు. పెదనందిపాడులో గుంటూరు-పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి తెదేపా కార్యాలయంపై దాడులకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరులో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. గంజాయి రవాణాపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారా? ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని తెదేపా నేతలు స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని