సీఎం జగన్‌ని అవమానిస్తే చూస్తూ ఊరుకోరు
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

సీఎం జగన్‌ని అవమానిస్తే చూస్తూ ఊరుకోరు

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అసభ్య పదజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అవమానపరిస్తే వైకాపా శ్రేణులు, ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబులతో కలిసి విలేకరుల సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు మార్గదర్శకం చేసి పెయిడ్‌ ఆర్టిస్టు పట్టాభితో సీఎంపై బూతులు మాట్లాడించారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చంద్రబాబు తనతో పాటు పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు. గాంధీ తత్వం, అంబేడ్కర్‌ భావజాలంతో వైకాపా పని చేస్తున్నప్పటికీ తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ని అవమానపరుస్తూ విమర్శిస్తే చేతులకు గాజులు వేసుకుని ముడుచుకుని ఉండాలా? అని ప్రశ్నించారు. సీఎంని ఇష్టానుసారంగా విమర్శిస్తూ బూతులు తిట్టడం, స్థాయికి దిగజారి విమర్శిస్తే తమ కార్యకర్తలు స్పందిస్తారని, మంగళవారం జరిగిన ఘటనల్లో తప్పు లేదని సమర్థించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గంజాయి సాగు కొత్తగా జరగడం లేదని, ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు జీవనోపాధిగా చేసుకుని పండిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం గంజాయి సాగు చేస్తుందని ఆరోపణలు చేయడంతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును నర్సీపట్నం పోలీసులు సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే చెప్పాలని అడిగేందుకు వచ్చారన్నారు. ప్రశ్నించే అధికారం వ్యవస్థలు, పోలీసులకు ఉంటుందని, దీనిపై తెదేపా నాయకులు అతిగా స్పందించారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగినట్లు, ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్లు అపోహలు సృష్టిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని