లంకపల్లి రేవులో అక్రమాలు
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

లంకపల్లి రేవులో అక్రమాలు

టన్ను ఇసుకకు రూ.720 చెల్లించాలట!

ఈనాడు, అమరావతి

లంకపల్లి రేవు వద్ద ఇసుక తవ్వకాలు

‘టన్నుకు రూ.720 చొప్పున సొమ్ములు కడితేనే ఇసుక ఎత్తుతాం. లేదా మీరు బల్క్‌గా 250 నుంచి 500 టన్నులకు సొమ్ములు చెల్లిస్తే టన్ను రూ.475 చొప్పున కట్టించుకుంటాం... సింగిల్‌గా ఒక్క లారీకి ఇసుక లోడ్‌ చేయం..!’

-ఇదీ లంకపల్లి ఇసుక రేవు వద్ద గుత్త సంస్థ

ప్రతినిధుల మాట!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌ వద్ద టన్నుకు రూ.475 చొప్పున వసూలు చేయాలి. కానీ అక్కడ కనీసం కాటా లేదు. ఇష్టానుసారం లోడ్‌ చేస్తున్నారు. కృష్ణా నదికి వరదలు రావడంతో రీచ్‌ వద్ద తవ్వకాలు నిలిపివేశారు. మూడు రోజుల క్రితం పమిడిముక్కల మండలం లంకపల్లి ఇసుక రేవును ప్రారంభించారు. రేయింబవళ్లు ఇసుక ఎత్తుతున్నారు. ఇసుక కోసం వెళ్లిన వారి వద్ద టన్నుకు రూ.720 చొప్పున వసూలు చేస్తున్నారు. సోమవారం, మంగళవారం ఇదే జరిగింది. కొంతమంది లారీ టిప్పర్ల డ్రైవర్లు ఎదురు తిరిగారు. ఇసుక రీచ్‌ వద్ద టన్ను ధర ప్రభుత్వం రూ.475 నిర్ణయిస్తే రూ.720 ఎలా వసూలు చేస్తారని జేపీ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో వారు సమాధానం చెప్పకుండా సింగిల్‌ లారీకి ఇసుక ఎత్తబోమని బుధవారం నిరాకరించారు. కనీసం 250 టన్నులు.. అంటే దాదాపు పది లారీల వరకు ఒకేసారి డబ్బు చెల్లిస్తేనే ఇసుక విక్రయిస్తామని చెబుతున్నారు. దీంతో పలువురు లారీ డ్రైవర్లు నిరీక్షించారు. లారీ యజమానులు సంప్రదించినా నిరాకరించారు. కొంతమందితో వాగ్వాదానికి దిగడంతో పామర్రు పోలీసు స్టేషన్‌లో మౌఖిక ఫిర్యాదు చేశారు. లారీ యజమానులు బుధవారం పామర్రు సీఐను సంప్రదించారు. సమస్య పరిష్కరించకుండా సర్ది చెప్పి గొడవ చేయవద్దంటూ సీఐ పంపించినట్లు తెలిసింది. గనుల శాఖ, ఎస్‌ఈబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు.టన్ను ఇసుకపై అదనంగా రూ.245 వసూలు చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గానికి ఇసుక నిల్వ కేంద్రం కనుమూరు వద్ద ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇక్కడకు రవాణా చేసి నిలువ కేంద్రం వద్ద విక్రయిస్తే రూ.635 తీసుకోవాల్సి ఉంది. కానీ లంకపల్లి రేవు వద్దనే రూ.720 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా వసూలు చేయడం విశేషం.దీనిని నిరసిస్తూ.. లంకపల్లిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

చర్యలు తీసుకుంటాం..

దీనిని గనుల శాఖ ఉపసంచాలకులు సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లగా అధిక ధరలు వసూలు చేస్తే.. రేవును మూసివేస్తామని చెప్పారు. బల్క్‌ ఇసుక మాత్రమే విక్రయించడం సరికాదని, ఒక్క లారీ ఇసుక అడిగినా.. టన్ను ఇసుక అడిగినా లోడ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇసుక అధిక దరలకు విక్రయించినా.. అవకతవకలకు పాల్పడినా.. ఎస్‌ఈబీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తనకు లంకపల్లి ఇసుక రేవుపై ఫిర్యాదులు అందాయని గురువారం విచారణకు సహాయ సంచాలకులను పంపిస్తానని చెప్పారు.


ఇసుక ఇవ్వనంటున్నారు..: వెంకటేశ్వరరావు, డ్రైవర్‌

మంగళవారం ఇసుక కోసం వచ్చాను. కానీ సింగిల్‌ లారీ ఇవ్వనన్నారు. 250 టన్నులకు కడితే ఇస్తామంటున్నారు. లారీ ఓనర్లు అందరూ వచ్చి అడిగారు. అయినా బల్క్‌ కట్టమంటున్నారు. అంత సొమ్ము ఇవ్వలేం. అధికారులు వేధిస్తున్నారు. అసలు సమాధానం చెప్పడం లేదు.

రశీదు ఇవ్వడం లేదు: శివకుమార్‌, లారీ యజమాని

సింగిల్‌ బండికి తీసుకోమంటున్నారు. ఒకేసారి 250 టన్నులు కట్టమంటున్నారు. టన్నుకు రూ.720 చొప్పున కట్టమంటున్నారు. ఇంత సొమ్ము కట్టలేం కదా. రశీదు కూడా ఇవ్వడం లేదు. సొమ్ములు కట్టినా మా దగ్గర ఆధారం లేదు. రేపు ఇసుక లోడ్‌ చేస్తారో లేదో తెలియదు.

రూ.720 కట్టాలట..: నరేంద్ర, లారీ యజమాని, డ్రైవర్‌

ఇసుక రేవు వద్ద రూ.720 చొప్పున బల్క్‌ ఇసుక కోసం కట్టాలి. ఈ విషయాన్ని గనుల శాఖ ఏడీకి ఫిర్యాదు చేశాం. ఆయన రూ.475 వసూలు చేయాలని చెప్పారు. ఇసుక నియంత్రణ విభాగం అధికారులకు చెబితే బందోబస్తులో ఉన్నామని చెబుతున్నారు. అంత సొమ్ము మేం కట్టలేం. ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని