దిగుబడి దిగువకు.. ధరలు పైకి..
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

దిగుబడి దిగువకు.. ధరలు పైకి..

కంకిపాడు, న్యూస్‌టుడే

పెరుగుదలలేని మిరప మొక్కలు

జిల్లాలో జులై నుంచి వరుసగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం కూరగాయల సాగుపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా దిగుబడి మూడో వంతుకు పడిపోయింది. చీడపీడల నుంచి రక్షణకు సస్య రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఫలసాయం కంటే ఖర్చు అధికమైంది. దీంతో ముందుగానే పైర్లను తొలగిస్తున్నారు. మరోపక్క ఈ ప్రభావం వినియోగదారులపైనా అధికంగా ఉంది. జూన్‌తో పోల్చితే దాదాపు అన్ని కూరగాయల ధరలు ఒకటిన్నర నుంచి రెండున్నర రెట్లకు పెరిగాయి. రైతు బజార్‌కు సరఫరా అయ్యే పరిమాణం 65 శాతానికి తగ్గిందని ఎస్టేట్‌ అధికారులు అంచనా వేశారు.

ఎలా దెబ్బతిన్నాయంటే?

కూరగాయల పైర్లు ఉరక(నీటినిల్వ)ను తట్టుకోలేవు. అరుతడి సాగు చేయాల్సి ఉంది. భూమిలో తేమ శాతం తగ్గకుండానే వర్షం పడుతోంది. బూజు, కుళ్లు తెగుళ్లు తీవ్రమయ్యాయి. పైర్లను రక్షించుకోడానికి రైతులు శత విధాలుగా ప్రయత్నించారు. ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీలు, దుకాణదారులు సూచనలతో నివారణ మందులు వాడుతూనే ఉన్నారు. ‘ఫలసాయ పరిమితి’ని సస్యరక్షణ ఖర్చులు దాటాయని గుర్తించిన కొందరు రైతులు పైర్లను తొలగించిడం, మరికొందరు పురుగుమందులు వాడకుండా తెగులు సోకిన మొక్కలను పీకి పారేయడం, పొలంలో నీరు నిల్వకుండా బోదెలు ఏర్పాటు, సాంద్రత అధికంగా ఉన్న చోట్ల మొక్కలను తొలగించి గాలి, వెలుతురు, వేడిమి పడేవిధంగా సర్దుబాటు, నేలబారిన పడిన మొక్కలను పందెర్లు/కర్రలతో పైకి కట్టడం, వేప సంబంధిత క్రిమి సంహారకాలను వాడడం, ములగ చెట్ల పైభాగాలను నరికి వేయడం తదితర యాంత్రిక సహజ పద్దతులు ఆచరిస్తున్నారు. వీటి ఫలితాన్ని వేచిచూడాలని రైతులు చెబుతున్నారు. గతంలోలేని విధంగా కందపైరుకూ ఉరక బెదడ ఎదురైంది. క్యాలీఫ్లవర్‌, క్యాబేజీతోపాటు నిమ్మ తోటలకూ అధిక నష్టం జరిగింది.

పెరటి తోటలపైనా..

ఈ ఏడాది పెరడుల్లో సొర, కాకర, పొట్ల, బెండ, గోరుచిక్కుడు, వంగ, టమోటా తదితర కాయగూరలు, తోటకూర, బచ్చలి, మెంతి, కొత్తిమీర, పొదీనా వంటి ఆకుకూరల పెంపకం గణనీయంగా పెరిగిందని ఉద్యానశాఖ అంచనా వేసింది. వ్యాపార సరళిలో వేసిన పొలాలకూ ఎదురైన సమస్యలే పెరటితోటలకూ చీడపీడల బెడద ఎక్కువైంది. దీంతో పెరటి కూరగాయల దిగుబడి చాలా వరకు తగ్గింది.

సమస్య పరిష్కారం ఇలా..

చీడపీడలు, తెగుళ్లకు రసాయన పురుగు మందుల వాడకాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలి. 50 శాతానికి పైగా దెబ్బతిన్న మొక్కలను తలగించాలి. కొత్తగా తోటలు వేయడానికి చలితిరిగే వరకు ఆగాలి. ఉరకను తట్టుకునే వంగడాలతో, మెరక భూముల్లోనే సాగు చేపట్టాలి. సహజ, యంత్రిక విధానాలతోనే సస్య రక్షణ చేపట్టాలని ఉద్యానశాఖాధికారి జి.లక్‌పతి సూచించారు.

జులై 16వ తేదీతో(బ్రాకెట్లలో ఉన్నవి) పోల్చితే

అక్టోబరు 16 నాటి రైతు బజారులో ధరలు ఇలా..

టమోటా కిలో రూ.41(20), వంగ రూ.30(12) బెండ రూ.24(20), దొండ రూ.24(10), బీర - రూ.30(20), సొర రూ.10(20), మునగ - రూ.10(6), ఆకుకూరల ధరలు కూడా 50 శాతం వరకు పెరిగాయి. ఇక బహిరంగ మార్కెట్‌లో 30 నుంచి 40శాతం మేర అధికంగా ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని