గురుకులాల్లో సమస్యల దండు
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

గురుకులాల్లో సమస్యల దండు

వంట గ్యాస్‌కు నిధుల కటకట

 నిర్వహణ ఖర్చులూ విడుదల చేయని వైనం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే

జిల్లాలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకులాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దసరా సెలవుల అనంతరం 18వ తేదీన గురుకులాలు తెరచుకోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు వస్తున్నారు. దీంతో వంట గ్యాస్‌ని తలచుకుని ప్రిన్సిపల్స్‌ ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు ఆహార పదార్థాలను వండి వార్చేందుకు అవసరమైన వంట గ్యాస్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్‌ సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొందరు ఆర్థిక భారం మోయలేక కేర్‌ టేకర్లను సర్దుబాటు చేసుకోవాలని చెపుతున్నారు. కేర్‌ టేకర్లు వంట గ్యాస్‌తో పాటు ఇతర ఆహార పదార్థాల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తుంది. దీంతో గురుకులాల్లో సమస్యలు దండుగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంట గ్యాస్‌ గుదిబండ

జిల్లాలో 20 గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో గురుకులంలో 450 నుంచి 700 మంది వరకు విద్యార్థులు ప్రవేశాలు పొంది చదువుకుంటున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ ఏడాది విద్యార్థులు చదువుకుంటున్నారు. నెలకు సగటున 30 నుంచి 45 గ్యాస్‌ సిలిండర్లు అవసరమవుతున్నాయి. గ్యాస్‌ ధర పెరిగిపోవడంతో గుదిబండగా మారిపోయింది. 14 కిలోల సిలిండర్‌ రూ.900 పైన చేరింది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం తయారు చేసేందుకు గ్యాస్‌ తప్పనిసరి. ముందుగానే మూడు చొప్పున సిలిండర్లను తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వారు డబ్బులు చెల్లిస్తేనే బండలు డెలివరీ చేస్తామంటున్నారు. సొసైటీ నుంచి నిధులు విడుదలైన తర్వాత ఇస్తామన్నా ఇవ్వని పరిస్థితి. దీంతో ప్రిన్సిపల్స్‌, కేర్‌ టేకర్లు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. నెలకు గ్యాస్‌ కోసం సుమారు రూ.40 వేలు ఖర్చు భరించాల్సి వస్తుందని వాపోతున్నారు.

నిర్వహణ ఖర్చుల ఊసే లేదు

గురుకులాల్లో విద్యుత్తు సరఫరా నిరంతరం ఉండేలా చూసేందుకు ప్రారంభంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లను నియమించగా ఎక్కువ మంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయా గురుకుల విద్యా సంస్థల్లో ప్రైవేటుగా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చారు. వందల మంది విద్యార్థులు ఉండే చోట్ల విద్యుత్తు నిరంతరం సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీటి పైపులైన్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు ప్లంబర్‌ చేయాల్సి ఉంటుంది. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో రెండు, మూడు నెలలు పని చేసి మానేస్తున్నారు. దాంతో ప్రిన్సిపల్స్‌ వారికి వేతనాలు సర్దుబాటు చేస్తూ వారిని బుజ్జగించి పనులు చేయించుకుంటున్నారు. ప్రారంభంలో ప్రతి గురుకులానికి నిర్వహణ ఖర్చుల కోసం రూ.40 వేలు ప్రభుత్వం విడుదల చేసేది. ఇప్పుడు దానిని రూ.15 వేలకు కుదించారు. అవి కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రిన్సిపల్స్‌ పరిస్థితి చెప్పనలవి గాకుంది. సీఎఫ్‌ఎంఎస్‌లో మాత్రమే బిల్లులు పంపాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు మినహా ఇతర ఖర్చులకు సంబంధించి గురుకులాలకు నిధులు విడుదల చేయని పరిస్థితి. గతంలో పాఠశాల నిర్వహణ, స్టేషనరి కోసం కొంత నగదును విడుదల చేయగా వాటిని సర్దుబాటు చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో చేతులు కట్టేసినట్లయింది. రెగ్యులర్‌ ప్రిన్సిపల్స్‌ లేని చోట్ల ఉపాధ్యాయులను ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్స్‌గా నియమించారు. అక్కడి సమస్యలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఓ వైపు విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తూనే మరోవైపు ఆయా పాఠ్యాంశాలను బోధించాల్సి ఉండడంతో అదనపు బాధ్యతలు వారిని ఆందోళనలో పడేస్తున్నాయి. వంట గ్యాస్‌, కార్యాలయ నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదల చేయాలని ప్రిన్సిపల్స్‌ కోరుతున్నారు.

* గురుకులాల్లో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, స్కావెంజర్లు, వంట సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. వీరు పొరుగు సేవల ఏజెన్సీ కింద ఉన్నారు. వీరికి ప్రభుత్వం నేరుగా వేతనాలు చెల్లించదు. ఏజెన్సీకి నెలకు నిధులు విడుదల చేస్తే ఆ సంస్థ ప్రతినిధులు కమిషను మినహాయించుకుని వేతనం చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో గుత్తకు పొందిన ఏజెన్సీ జిల్లాల్లో సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే వారికి వేతనాలు చెల్లిస్తున్నారు.

గురుకులాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు అనువుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారని, నిధులు విడుదల చేయకుంటే వీటిని ఎలా చేయగలమని ప్రిన్సిపల్స్‌ ప్రశ్నిస్తున్నారు. నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని