మిర్చి రైతుపై మొక్కల భారం
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

మిర్చి రైతుపై మొక్కల భారం

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, మేడికొండూరు

మిర్చి నారు నర్సరీ

మిర్చి పంట సాగు ఈ ఏడాది ఆలస్యంగా మొదలైంది. ప్రారంభంలో వర్షాలు లేకపోవడం, వర్షాలు మొదలైన తర్వాత మొక్కలు నాటుకునేందుకు వెసులుబాటు లేకుండా వరుసగా పడడంతో పంట సాగు జాప్యమైంది. ఆలస్యంగా వేసిన మొక్కలు ఇటీవల వరుసగా వచ్చిన వర్షాలకు దెబ్బతిన్నాయి. ఉరకెత్తి కొన్ని మొక్కలు చనిపోయాయి. దీనికితోడు ఎండలు కూడా మండిపోవడంతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నాయి. వీటిస్థానంలో కొత్త మొక్కలు వేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మిరప మొక్కలకు డిమాండ్‌ పెరిగి ఒక్కొక్క మొక్క రూపాయికి పైగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు ఆగిన తర్వాత ఎండలు ఎక్కువగా ఉండడంతో వాతావరణం ప్రతికూలంగా మారి మొక్కలు వడలిపోయాయి. ఈ ఏడాది పడి మొక్కలు ఎక్కువగా వేయాల్సి రావడంతో వాటి కొనుగోలుతో పాటు నాటేందుకు కూలి ఖర్చుల రూపంలో అదనంగా సొమ్ము వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి సాధారణ విస్తీర్ణం 73777 హెక్టార్లు కాగా ఈఏడాది ఇప్పటికే 96573 హెక్టార్లలో మిర్చి సాగయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని నర్సరీ యజమానులు సైతం తొలివిడత నారు అమ్మకాలు పూర్తికాగానే రెండో విడత మొక్కలు పెంచేవారు. ఈ ఏడాది డిమాండ్‌ను అంచనా వేసి తొలిదశలో ఎక్కువ విస్తీర్ణంలో నర్సరీలు పెంచారు. రెండోవిడత మొక్కల పెంపకానికి ఆసక్తి చూపలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మిర్చి నారు అందుబాటులో లేక క్రోసూరు, పెదకూరపాడు తదితర ప్రాంతాల నుంచి పేరేచర్లకు వచ్చి నారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దూరప్రాంతాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు మొక్కలు చనిపోయిన ప్రాంతాన్ని గుర్తించి నాట్లు వేయడానికి కూలీల ఖర్చు పెరుగుతోంది. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఈ విషయమై ఉద్యానశాఖ ఉపసంచాలకులు సుజాత ‘ఈనాడు’తో మాట్లాడుతూ పంట మార్పిడి చేయకుండా వరుసగా మిర్చి సాగుచేయడం వల్ల వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మొక్కలు చనిపోయే అవకాశముందని తెలిపారు. వాతావరణ ప్రతికూలతలు, సీజనల్‌ వ్యాధుల వల్ల కొన్ని మొక్కలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు మిర్చి మొక్కలు నాటే ముందు ట్రీట్‌మెంట్‌ చేసుకుని నాటుకుంటే మొక్కలు చనిపోయే శాతం చాలా స్వల్పంగా ఉంటుందన్నారు.


2300 మొక్కలు కొనుగోలు చేశాను


 

కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో పొలంలో మిర్చి మొక్కలు కొన్ని చనిపోయాయి. మాకు దగ్గరలో మిరప నారు అందుబాటులో లేకపోవడంతో మేడికొండూరు మండలం పేరేచర్ల నర్సరీ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాను. మొక్కకు రూపాయి చొప్పున 2300 కొన్నాను. మొక్కల కొనుగోలుతో పాటు నాటేందుకు కూలీల ఖర్చు కలిపి రూ.5వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది.

- చింతరెడ్డి వెంకటరెడ్డి, గాదావారిపాలెం, క్రోసూరు మండలం


ఒక్కొక్క మొక్క ధర రూ.1.25

నాలుగెకరాల్లో మిర్చి పంట సాగుచేశా. ఇటీవల వర్షాలకు పొలం ఉరకెత్తి అక్కడక్కడా మొక్కలు చనిపోయాయి. పడి మొక్కలు నాటేందుకు మేడికొండూరు మండలం పేరేచర్ల నర్సరీల్లో మొక్కలు తీసుకుని వెళుతున్నాను. ఒక్కొక్క మొక్కకు రూ.1.25 చెల్లించి కొనుగోలు చేశా. పడి మొక్కలు ఎక్కువగా వేయాల్సి రావడంతో నారు కొరత ఏర్పడి ధర పెరిగింది. దీంతో రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి.

- వెంకటేశ్వరరావు, మిరప రైతు, ప్రత్తిపాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని