సర్కారు బడిలో చేరేదెలా..
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

సర్కారు బడిలో చేరేదెలా..

ఈనాడు, అమరావతి

కొవిడ్‌ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. వరుసగా రెండేళ్ల నుంచి కొవిడ్‌తో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెప్పించలేక మధ్యే మార్గంగా ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి ముందుకొస్తున్నారు. ఇలా వచ్చేవారికి ప్రవేశాలు కల్పించడానికి విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. 8వ తరగతి వరకు టీసీలు లేకపోయినా ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడానికి ఆసక్తితో వస్తున్నామని లేఖ తీసుకుని ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల వివరాలు పాఠశాల విద్యాశాఖకు చెందిన ఛైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో ఉంటాయి. ప్రైవేటు బడి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి వస్తుంటే తొలుత మండల విద్యాశాఖ అధికారి ఛైల్డ్‌ఇన్‌ఫో డేటాలో విద్యార్థి పేరును తొలగిస్తే వెంటనే పాఠశాల హెచ్‌ఎం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ప్రవేశం కల్పించడానికి వీలవుతుంది. ఇలా వచ్చే విద్యార్థుల వివరాలను కొందరు ఎంఈఓలు ఛైల్డ్‌ ఇన్‌ఫో డేటా నుంచి తొలగించడం లేదని, దీంతో పిల్లలను చేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటోందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

* తెనాలి డివిజన్‌కు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఇటీవల తెనాలిలో రెండు ప్రైవేటు పాఠశాలల నుంచి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరతామని వచ్చారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులను తొలుత వారి పేర్లను ఛైల్డ్‌ ఇన్‌ఫోలో తొలగించుకోవాలని ఎంఈఓ వద్దకు పంపాం. వారికి ఓ ఎంఈఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌ను కలిసి రావాలని సూచించారు. దీంతో ఆ విద్యార్థులను ఇప్పటికీ చేర్చుకోలేదని, వారికి తాము ప్రవేశం కల్పించకపోతే ఈ ఏడాదికి వారు ప్రైవేటులో కొనసాగాల్సిందేనని సదరు హెచ్‌ఎం వివరించారు. కొందరు ఎంఈఓలు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో కుమ్మక్కయి వారి పేర్లను ఛైల్డ్‌ ఇన్‌ఫో నుంచి తొలగించకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత పాఠశాలకు వెళ్లి ఏమైనా బకాయిలు ఉంటే వాటిని పరిష్కరించుకుని రావాలని, ఆ తర్వాతే తాము ఆన్‌లైన్‌లో తొలగిస్తామని చెబుతున్నారని ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు వివరించారు. నూతన ప్రవేశాలు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఆ తర్వాత ఇక చేర్చుకోవడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవైపు తుది గడువు సమీపిస్తుంటే సర్కారీ పాఠశాలల్లో చేరతామని వచ్చే పిల్లలను అక్కున చేర్చుకోవటానికి ప్రాధాన్యమివ్వాల్సిన విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలికేలా వ్యవహరించడంతో పేద పిల్లలకు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య గుంటూరు నగరం, సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్లలోని కొన్ని మండలాల్లో ఉందని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరతామని వచ్చే పిల్లల వివరాలను తొలుత ఎంఈఓలు ఛైల్డు ఇన్‌ఫోలో తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని