లీజు సొమ్ము అడిగితే దౌర్జన్యం చేసి కొట్టారు
eenadu telugu news
Published : 22/10/2021 05:57 IST

లీజు సొమ్ము అడిగితే దౌర్జన్యం చేసి కొట్టారు

పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు

చెరువు తవ్వకాన్ని నిలిపేయాలని పొక్లయిన్‌కు అడ్డుగా  కూర్చున్న బాధితురాలు వెంకటరమణ కుటుంబం

ఎల్‌ఎన్‌పురం(నందివాడ), న్యూస్‌టుడే: ఏడేళ్లుగా తన భూమికి లీజు సొమ్ము ఇవ్వకుండా తనపైన, తన కుటుంబంపైన దౌర్జన్యం చేస్తున్నారని లక్ష్మీనరసింహపురం గ్రామానికి చెందిన కంచరపు వెంకట రమణ గురువారం లీజుదారు, పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలపర్రు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 556జ1లో కంచరపు వెంకట రమణ పేరుమీదు 1.93 ఎకరాలను 2005లో ప్రభుత్వం డి పట్టా ఇచ్చింది. దీంతో పాటు పాస్‌పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రాలను కూడా అధికారులు ఆమెకు ఇచ్చారు. చేపల చెరువుల్లో కలిసి ఉన్న ఈ భూమికి కొంతకాలం లీజు సక్రమంగా ఇచ్చారని బాధితురాలు తెలిపింది. ఏడేళ్లుగా లీజు ఇవ్వడం లేదని, అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమని లీజుదారు, పెద్దలతో కలిసి దౌర్జన్యం చేస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ భూమి ఉన్న చెరువుని ఇటీవల ఎండగట్టి మరమ్మతుల పేరుతో తవ్వకాలు చేస్తున్నారు. లీజు ఇవ్వనిదే తన భూమిలో తవ్వకాలు చేయొద్దని బాధితురాలు కంచరపు వెంకట రమణ, ఆమె భర్త సత్యనారాయణ, కుమారునితో కలిసి గురువారం పొక్లయిన్‌కు అడ్డంగా కూర్చున్నారు. లీజు వ్యవహారం పరిష్కరించే వరకూ తన భూమిని తవ్వొద్దని కోరితే లీజుదారు, పెద్దలతో కలిసి దౌర్జన్యంచేసి కొట్టారని బాధితురాలు, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి వెంకట రమణ పేరుతోనే ఇచ్చినట్లు రికార్డుల్లో ఉందని, వారికి లీజు ఇవ్వాల్సిందేనని తహసీల్దార్‌ రెహ్మాన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని