గృహ హక్కు పథకానికి 2.5 లక్షల ఇళ్ల గుర్తింపు
eenadu telugu news
Published : 22/10/2021 06:07 IST

గృహ హక్కు పథకానికి 2.5 లక్షల ఇళ్ల గుర్తింపు

వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్‌ నివాస్‌. చిత్రంలో జేసీలు ఎస్‌.ఎన్‌.అజయ్‌కుమార్‌, మాధవీలత తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : గత ప్రభుత్వాల హయాంలో 1983 నుంచి 2005 సంవత్సరం వరకు నిర్మించిన గృహాలకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వర్తింప చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అప్పట్లో వివిధ పథకాల కింద నిర్మించిన గృహాలు 2.8 లక్షలు ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో 2.5 లక్షల ఇళ్ల లబ్ధిదారులను గుర్తించినట్టు చెప్పారు. ఇంకా 30 వేల గృహాలకు సంబంధించిన వారి వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. తాను నివాసం ఉంటున్న లబ్ధిదారుడికి ఆ ఇంటిపై పూర్తి హక్కు లభించేలా చేయడమే ఈ పథకం థ్యేయమన్నారు. ఆయా గృహాల్లో లబ్ధిదారులు లేదా అతని వారసులు నివాసం ఉంటున్నారా?, ఇతరులకు విక్రయించి వెళ్లారా? అనే వివరాలతో పాటు, ఇంటి సరిహద్దులను గుర్తించాలన్నారు. పట్టణ లబ్ధిదారుడి నుంచి రూ.15 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల చొప్పున వసూలు చేయాలని పేర్కొన్నారు. డిసెంబరు 21 నాటికి సదరు ప్రక్రియను పూర్తి చేసి, ఎప్పటికప్పుడు డేటాను డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా పూర్తి చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

* నివేశన స్థలాలపై అన్ని రకాల హక్కులు..  
సంపూర్ణ గృహ పథకం వల్ల ఎంతో ఉపయోగం ఉందని జేసీ కె.మాధవీలత తెలిపారు. ఇంటి పట్టాలు లబ్ధిదారుని చేతికే అందుతాయని, ఆ స్థలంపై అన్ని రకాల హక్కులు వస్తాయన్నారు. వీసీలో మరో జేసీ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, గృహ నిర్మాణ సంస్థ, టిడ్కో పీడీలు రామచంద్రన్‌, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని