ఏపీ లాసెట్‌లో సత్తా
eenadu telugu news
Published : 22/10/2021 06:51 IST

ఏపీ లాసెట్‌లో సత్తా

కానూరు, న్యూస్‌టుడే: ఏపీ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు వచ్చాయి. ఈ రెండింటిలోనూ నగర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మూడేళ్ల న్యాయ శాస్త్రం కోర్సులో నగరానికి చెందిన హరిప్రియ రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించగా.. పీజీ లాసెట్‌లో పలువురు పది లోపు ర్యాంకులు సాధించారు. వారంతా సిద్ధార్థ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.


మంచి న్యాయవ్యాదిగా: ఎం.సుసన్య(4)

విజయవాడ గిరిపురానికి చెందిన సుసన్య 80 మార్కులతో 4వ ర్యాంకు సాధించింది. బీఏఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రెండేళ్ల మాస్టర్స్‌లా చేయడానికి పీజీ లాసెట్‌ పూర్తి చేయడానికి ఎంట్రన్స్‌ రాశారు. పీజీ  పూర్తి చేసి మంచి న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకుంటానని, పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తానని పేర్కొన్నారు.


ఇష్టపడి చదవాలి..: పి.మమత(7)

బెజవాడ ప్రకాష్‌నగర్‌కు చెందిన మమత 48వ ఏట 7వర్యాంకు  పొందారు. బీఏఎల్‌ఎల్‌బీ చదివారు. న్యాయశాస్త్రంలో మరింత పట్టు సాధించడానికి పీజీ రాశారు. రెండేళ్ల పీజీ పూర్తి చేసి న్యాయరంగంలో రాణించడమే తన లక్ష్యమంటున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడం వలన 77 మార్కులతో ఈ ర్యాంకు సాధించానన్నారు.


జడ్జినవుతా..- కె.లక్ష్మీతరుణి(10)

చల్లపల్లికి చెందిన లక్ష్మి 75 మార్కులతో 10వ ర్యాంకు సాధించింది. బీఏఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఇప్పుడు పీజీ పూర్తి చేసి జడ్జి పరీక్షలు రాసి మంచిగా రాణించడమే తన లక్ష్యమంటున్నారు. కష్టపడి చదివి ఈ ర్యాంకు సాధించానని అన్నారు.


పేదలకు న్యాయ సేవలు అందిస్తా.. - టి.రమేష్‌బాబు (పీజీ లాసెట్‌లో 3వ ర్యాంకు)

నగరంలోని పటమటకు చెందిన తాతపూడి రమేష్‌బాబు పీజీ లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 80 మార్కులతో ఈ ర్యాంకు సాధించారు. అతను బీఏఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాదిగా పని చేస్తున్నారు. పీజీ లాసెట్‌ కూడా పూర్తి చేసి మరింత సబ్జెక్టు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచి న్యాయవాదిగా స్థిరపడి పేదలకు న్యాయ సేవలు అందించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. సబ్జెక్టు నిత్యం చదవడం, సెక్షన్లు గుర్తుపెట్టుకోవడం వలన తనకు ఈ ర్యాంకు సాధ్యమయ్యిందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని