ఎరువు లేదాయె!
eenadu telugu news
Updated : 22/10/2021 06:52 IST

ఎరువు లేదాయె!

ఈనాడు, అమరావతి

ఖరీఫ్‌లో వరి పంట పొట్ట దశకు వచ్చింది. ఈ సమయంలో పొటాష్‌ ఎరువును అందించాల్సి ఉంది. కానీ ప్రైవేటు మార్కెట్‌లో పొటాష్‌ ఒక్క బస్తా లేదు. ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌లకు వచ్చిన నిల్వను అందిస్తున్నారు. ఆర్‌బీకేల నుంచి రైతులకు పొటాష్‌ కోసం ప్రయత్నాలు చేస్తుంటే వృథా అవుతున్నాయి. స్టాక్‌ లేదనే సమాధానం వస్తోంది. కానీ వచ్చిన స్టాక్‌ వచ్చినట్లే మాయం అవుతోంది. ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమే ప్రజాప్రతినిధుల సిఫార్సులు కాదు.. ఇప్పుడు రైతులకు పొటాష్‌ ఎరువు కావాలన్నా.. వారి సిఫార్సులు ఉంటేనే అందుతున్నాయి. అవును ఇది నిజం. కృష్ణా జిల్లాలో ఆర్‌బీకేలలో పొటాష్‌ రైతులకు ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సిఫార్సులు ఉంటేనే అందిస్తున్నారు. ‘మన’ వారైతేనే వారు సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. అదీ కొన్ని ఆర్‌బీకేలలోనే పొటాష్‌ లభ్యం అవుతోంది. స్టాక్‌ పాయింట్‌ నుంచి ఆ పీఏసీఎస్‌లకు, ఆర్‌బీకేలకు రావడానికి ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సులు కావాల్సి వస్తోంది. తమ ఎమ్మెల్యే లేదా మంత్రులతో సిఫార్సు చేయించుకుంటేనే సంబంధిత ఆర్‌బీకేలకు స్టాకు ఇస్తున్నారు. తిరిగి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చెబితేనే ఇస్తున్నారు. ఇదీ జిల్లాలో జరుగుతున్న తంతు. మరోవైపు గడువు ముంచుకొస్తుండడంతో అన్నదాతలు పొటాష్‌ కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో గురువారం నాటికి కేవలం 940 టన్నుల పొటాష్‌ ఆర్‌బీకేలకు, పీఏసీఎస్‌ల వద్ద నిలువ ఉన్నట్లు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మోహన్‌రావు ‘ఈనాడు’తో చెప్పారు. కానీ రైతులు ఆర్‌బీకేలకు వచ్చి తిరిగి పోతున్నారు.


ఎందుకు పొటాష్‌..!

జిల్లాలో ఎక్కువగా ఖరీఫ్‌లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో పొట్టకు వచ్చిన దశలో పొటాష్‌(ఎంఓపీ) వేస్తారు. దీనివల్ల దిగుబడి పెరుగుతుందని రైతులు భావిస్తారు. తాలు శాతం తగ్గిపోతుంది. గింజ బరువు పెరుగుతుంది. బంగారు వర్ణం వస్తుంది. నాణ్యత ఎక్కువగా ఉంటుంది. పొట్ట దశ నుంచి పాలు పోసుకుని గింజ ఏర్పడే దశ వరకు పొటాష్‌ను అందిస్తారు. ఎకరానికి 25 కేజీలు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 8లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది. డెల్టా కింద దాదాపు 6.5లక్షలు ఉంది. ఎన్‌ఎస్‌పీ, బోర్లు, మెట్ట ప్రాంతంలో చెరువుల కింద సాగు చేస్తున్నారు. 20వేల టన్నుల వరకు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం జిల్లాలో 940 టన్నులు మాత్రమే ఉంది. ఇప్పటివరకు 7,540 టన్నులు ఖరీఫ్‌ సీజన్‌లోనూ వాడారు. వరి, పసుపు, మెట్ట పంటలకు అవసరం. పసుపు పంటకు ఎకరానికి 50 కేజీల వరకు వినియోగిస్తారు. దుంప తెగులు రాకుండా నాణ్యమైన పసుపు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెట్ట పంటల్లో మిరప, ఇతర వాటికి వీటిని వినియోగిస్తున్నారు. మిరప పంటకు ఇప్పుడు డీఏపీ అవసరం ఉంది. వాటి నిలువలు లేవు.


బస్తా రూ.1350కు  కొనుగోలు చేశా! -తుమ్మల జగదీష్‌, కోలవెన్ను

నేను మొత్తం 30 ఎకరాల్లో వరి సాగు చేశా. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఎక్కడా పొటాష్‌ లభించలేదు. నూజివీడు ప్రాంతంలో బస్తా రూ.1350 చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చా. ఎకరానికి 25 కేజీలు వేయాల్సి ఉండగా.. 12.50 కేజీలతో సరిపుచ్చా. ప్రస్తుతం మరికొంత వేద్దామని అడిగితే రూ.1400 అని చెప్పారు. అదీ స్టాక్‌ లేదని, వచ్చిన తర్వాత ఇస్తామని అంటున్నారు. ఆర్‌బీకేలలో మాకు ఇవ్వడం లేదు.


అమ్మోనియా  వేశాను..! -కందుల ఆంజనేయులు, కొండపేట, చందర్లపాడు

మిరప సాగు చేశా. ప్రస్తుతం డీఏపీ, పొటాష్‌ రెండూ అందించాల్సి ఉంది. ఈ రెండు రకాలు మార్కెట్‌లో దొరకడం లేదు. పొటాష్‌ బస్తా రూ.1600 చెబుతున్నారు. నేను మిరప పంటకు ప్రత్యామ్నాయంగా అమ్మోనియా వేశా. ఎలా ఉంటుందోనన్న అనుమానం ఉంది. నాణ్యమైన దిగుబడికి ఇప్పుడు పొటాష్‌ అందించాల్సి ఉంది.


పరిస్థితి  దారుణంగా ఉంది! -మాదల సురేష్‌, కంచెల, నందిగామ

నేను 50 ఎకరాలు వరి సాగు చేశాను. ప్రస్తుతం పొట్ట మీద ఉంది. ఎక్కడా పొటాష్‌ లభించడం లేదు. ఇటీవల స్వల్ఫ మొతాదులో కొంత లభిస్తే వేశా. ఆర్‌బీకేలో ఇవ్వడం లేదు. నేను రూ.1250కు కొనుగోలు చేసి సర్దుబాటు చేసుకున్నాను. సగం మాత్రమే అందించగలిగాను.
ఖరీఫ్‌ ప్రారంభంలో ఎంవోపీ బస్తా రూ.750కి లభించేది. అప్పుడు పెద్దగా డిమాండ్‌ లేదు. ప్రస్తుతం ఎరువు ధరలు పెరిగాయి. పొటాష్‌ 25కేజీల బస్తా ధర రూ.1050కు ఆర్‌బీకేలో విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో రూ.1400కు అతి కష్టం మీద విక్రయిస్తున్నారు. ఇటీవల కైకలూరు ప్రాంతంలో అధిక ధరలకు ఎరువులు విక్రయించడాన్ని విజయవాడ సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ మారు వేషంలో వెళ్లి పట్టుకున్నారు. రెండు దుకాణాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.


కొరత లేదు :  మోహన్‌రావు, జేడీఏ

జిల్లాలో రైతులు పొటాష్‌ ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో నేలలు పొటాష్‌ కలిగి ఉన్నవే. అనవసరంగా ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేటు డీలర్ల వద్ద పొటాష్‌ లేదు. ఆర్‌బీకేలకు, పీఏసీఎస్‌లకు 940 టన్నులు వస్తే సర్దుబాటు చేశాం. ఆర్‌బీకేలలో ఈ క్రాప్‌ వివరాల ఆధారంగా పొటాష్‌ విక్రయిస్తున్నాం. కొన్ని సొసైటీలకు అందించాం. ఇంకా వచ్చే అవకాశం ఉంది. పొటాష్‌ వేయకపోతే దిగుబడి తగ్గుతుందనేది అపోహ మాత్రమే. రూ.1050 కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని