మహాయజ్ఞంలో మనం
eenadu telugu news
Published : 23/10/2021 05:42 IST

మహాయజ్ఞంలో మనం

30 లక్షల మందికి పైగా మొదటి డోసు పూర్తి
ఈనాడు-అమరావతి

వందకోట్ల డోసుల మైలురాయిని అధిగమించటాన్ని పురస్కరించుకుని 75 త్యాళ్లూరులో బెలూన్లు వదులుతున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది

జిల్లాలో 87 ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్‌ నిత్యకృత్యంగా సాగుతోంది. కొవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న వారిలో మొదటి వరుసలో నిలిచిన  వైద్య, ఆరోగ్యయంత్రాంగం మొదటి డోసు నూరుశాతం వేయించుకుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది 52,477 మంది ఉన్నారు. వీరందరికి మొదటి డోసు పూర్తి కాగా రెండో డోసు 47,342 మంది మాత్రమే వేయించుకున్నారు. వీరిలో ఇంకా 3678 మంది రెండో డోసు వేయించుకోలేదు. ఆ తర్వాత వరుసలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌శాఖలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.జిల్లా వ్యాప్తంగా 1011 గ్రామ పంచాయతీలు, 13 నగర, పురపాలికల్లో కలిపి ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 2,03,397 మంది ఉండగా వీరు కూడా మొదటిడోసు నూరుశాతం పూర్తి చేసుకున్నారు. 22,239 మంది రెండోడోసు వేయించుకోలేదు. హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత కొవిడ్‌ ప్రభావానికి బాగా గురవుతున్నవారిలో 45 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. వీరికి ఈ ఏడాది జనవరి నుంచి టీకా వేయటం ప్రారంభమైంది. తొలి నాళ్లలో వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే టీకా వేసేవారు. అప్పట్లో చాలా మంది అది వేయించుకోవటానికి విముఖత చూపేవారు. వలంటీర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది బలవంతంగా పిలిచి టీకాలు వేయించే పరిస్థితి నుంచి ప్రజలు చైతన్యులై టీకాలకు బారులు తీరటంతో ఒక్కసారిగా జిల్లాలో లక్ష్యం పెరిగింది.  45 ఏళ్ల పైబడిన వారు 14.51 లక్షల మంది మొదటి డోసు పూర్తి చేసుకోగా 10.12 లక్షలమంది రెండు డోసులు వేయించుకున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం టీకా నిల్వలు లభ్యత బాగా ఉండటంతో జిల్లాలో గురువారం నాటికి 30.06 లక్షలమంది ఒక డోసు పూర్తి చేసుకున్నారు. 16.45 లక్షలమందికి రెండు డోసులు పూర్తయ్యాయి.

కోల్డు చెయిన్‌ బాక్సులతో..
సకాలంలో ప్రతి ఒక్కరికీ టీకా పూర్తి చేసి కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో వైద్య యంత్రాంగం గ్రామాల్లోకే కాదు.. పొలాల్లోకి సైతం వెళ్లి టీకాలు వేశారు. తొలుత గుంటూరు జీజీహెచ్‌, తెనాలి జిల్లా ఆసుపత్రి, నరసరావుపేట, బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల్లో మాత్రమే వేసేవారు. టీకా కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అన్ని పీహెచ్‌సీలకు విస్తరించింది. 4 వేలమందికి పైగా ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ ఓ క్రతువుగా కొనసాగుతోంది. కొవిన్‌యాప్‌లో లబ్ధిదారుల పేర్లను నమోదు చేసుకుని ఇంకా వ్యాక్సిన్‌ ఎవరు వేయించుకోలేదో గుర్తించి మరీ పిలిచి టీకా వేయటం కనిపిస్తోంది. మెగా వ్యాక్సిన్‌ పేరుతో ఒకే రోజు లక్షకు పైగా డోసులు మూడు సార్లు వేయటంతో ఒక్కసారిగా జిల్లా లక్ష్యం పెరిగింది. పెదకూరపాడు మండలం బలుసుపాడు, కాశిపాడు గ్రామాల్లో 45 ఏళ్ల పైబడిన వారికి నూరు శాతం రెండు డోసులు పూర్తయ్యాయి. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సహకారంతో ఇక్కడ నూరుశాతం చేసినట్లు ఆ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని