300 గ్రామాల్లో పాల సేకరణకు కార్యాచరణ
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

300 గ్రామాల్లో పాల సేకరణకు కార్యాచరణ

సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని 719 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 779 నివాస ప్రాంతాలున్న క్రమంలో.. జగనన్న పాల వెల్లువ పథకం కింద తొలి విడతలో 300 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేలా కార్యాచరణను త్వరితగతిన రూపొందించాలని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఎండీ ఎ.బాబు సూచించారు. నగరంలోని విడిది కార్యాలయంలో పాల వెల్లువ జిల్లా స్థాయి కోర్‌ టీమ్‌ సమావేశాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిని ముందుగా అంచనా వేయాలన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి, పాడి పశువులు కలిగిన మహిళలను గుర్తించి వారి వివరాలు రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు, సొంత పశువులు కలిగి ఉన్న వారిని గుర్తించాలన్నారు. ముందుగా మహిళా డెయిరీ అసోసియేషన్‌ సెంటర్‌ను రిజిస్టరు చేసి, వాటి పనితీరు ఆధారంగా 90 రోజుల తర్వాత మహిళా డెయిరీ సహకార సంఘంగా నమోదు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో పాలు పోసే వారికి ఎలాంటి హామీ లేకుండానే వర్కింగ్‌ క్యాపిటల్‌గా రూ.30 వేల వరకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలు పోసే రైతులకు గేదెలను మంజూరు చేయాలన్నారు. ఇందుకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.70 లక్షల వరకు అందించొచ్చని వివరించారు. పాలు పోసేవారు మాత్రమే ప్రమోటర్లుగా ఉండాలన్నారు. సమావేశంలో జేసీలు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, విజయవాడ సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు ఆర్డీవోలు జి.శ్రీనుకుమార్‌, ఖాజావలి, కె.రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని