జల కాలుష్యమే..!
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

జల కాలుష్యమే..!

కె.వి.ఆర్‌.కాలనీ అనారోగ్యాలకు కారణం

ఈనాడు, అమరావతి


కాలనీకి సమీపంలో చెత్త డంపింగ్‌యార్డు

విజయవాడ శివారుల్లోని ఎనికేపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కె.వి.ఆర్‌.కాలనీ వాసుల అనారోగ్యాలకు జల కాలుష్యమే కారణమని ప్రాథమికంగా నిర్థరించారు. స్థానికులు తాగుతున్న నీటిలో క్లెబ్సియెల్లా అనే బ్యాక్టీరియా అధికంగా ఉండడం వల్ల అనారోగ్యాలకు గురైనట్టు అధికారులు భావిస్తున్నారు. స్థానికంగా మూడు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ పరీక్షల ఫలితాలు శనివారం వచ్చాయి. నీటిలో ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే క్లెబ్సియెల్లా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కె.వి.ఆర్‌.కాలనీలో కొద్దిరోజులుగా పలువురు అనారోగ్యాలకు గురవుతూ వస్తున్నారు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కె.లీల అనే ఓ మహిళ అనారోగ్యం బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల కిందట చనిపోయింది. దీంతో స్థానికంగా అందరిలో ఆందోళన నెలకొంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కాలనీని సందర్శించి.. ఇంటింటికీ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 15మంది వరకు వ్యాధి బారినపడినట్టు గుర్తించారు.

వాటర్‌ ప్లాంట్‌కు మూత..

డయేరియా లక్షణాలు కనిపిస్తుండడంతో జిల్లా అంటువ్యాధుల నిపుణుల బృందం కాలనీకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌లో నీటిని కొనుగోలు చేసి కాలనీవాసులు తాగుతున్నారు. ఆ ప్లాంట్‌కు చెందిన నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించారు. ఇంటింటికి వచ్చే నల్లాలు, భూగర్భ జలాలల నమూనాలను కూడా పరీక్షించారు. ప్లాంట్‌ నుంచి కొనుగోలు చేసి తాగుతున్న నీటిలో క్లెబ్సియెల్లా ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఓ నల్లా ద్వారా వచ్చే నీటిలోనూ అధికంగానే ఉన్నట్టు గుర్తించారు. వాటర్‌ ప్లాంట్‌ను ఐదు రోజుల కిందటే అధికారులు మూయించారు.

ఇబ్బందికర పరిస్థితి లేదు.. :  - డాక్టర్‌ సుహాసిని, కృష్ణా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి

పైప్‌లైన్‌లో ఎక్కడ కలుషితం జరుగుతుందో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీకి సూచించాం. అనారోగ్యాలకు ఇంకేదైనా కారణం ఉందేమోనని పరిశీలిస్తున్నాం. ప్రసుతం కాలనీలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని