తెదేపా నాయకుడు కాట్రగడ్డ బాబు హఠాన్మరణం
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

తెదేపా నాయకుడు కాట్రగడ్డ బాబు హఠాన్మరణం


కాట్రగడ్డ బాబు (పాత చిత్రం)

ఈనాడు, అమరావతి- పటమట, న్యూస్‌టుడే: తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు కాట్రగడ్డ నాగ మల్లేశ్వరరావు(బాబు)(64) శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లోని తన ప్రింటింగ్‌ ప్రెస్‌ కార్యాలయంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కూర్చున్న చోటే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో కాట్రగడ్డ బాబు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ కుటుంబ నుంచి వచ్చిన బాబు ఆరంభంలో వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. స్థానిక సమస్యల మీద పోరాడిన నాయకుడిగా పేరుంది. 25 ఏళ్ల కిందట ఆయన అన్నయ్య కాట్రగడ్డ వెంకట నారాయణ రాజకీయ హత్యకు గురికావడంతో వామపక్ష పార్టీకి దూరమయ్యారు. అనంతరం తెదేపాలో చేరిన ఆయన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా, విజయవాడ నగరంలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. 12 సంవత్సరాల కిందట ఆయనపై ఓసారి హత్యయత్నం జరిగింది. ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఎంపీ కేశినేని నాని సహా పలువురు నాయకులు కాట్రగడ్డ బాబు నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.


బాబు భౌతికకాయం వద్ద నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు

ఫ్లెక్సీలు తెచ్చిన వ్యక్తిగా..

విజయవాడలో ముద్రణ రంగంలో తనదైన గుర్తింపును బాబు తెచ్చుకున్నారు. నగరంలో వేడుకలకు బ్యానర్లు రాసే విధానానికి స్వస్తి పలికి ఫ్లెక్సీలను తొలిసారి పరిచయం చేశారు. ఆ తర్వాత ఈయన తన ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారా ముద్రించే ఫ్లెక్సీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

మరణం బాధాకరం: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: పార్టీ సీనియర్‌ నేత కాట్రగడ్డ బాబు హఠాన్మరణం బాధాకరమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక సేవలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని, దశాబ్దకాలంగా విజయవాడలో పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కాట్రగడ్డ బాబు మరణంతో ఒక బలమైన నాయకుడ్ని కోల్పోయామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని