జీజీహెచ్‌లో ఉచిత కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు
eenadu telugu news
Published : 24/10/2021 05:53 IST

జీజీహెచ్‌లో ఉచిత కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్‌, పక్కన ప్రభావతి తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: తీవ్రమైన వినికిడి లోపం ఉన్న ఐదుగురు పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ను అమర్చాలని నిపుణులైన వైద్యులు నిర్ణయించారని సూపరింటెండెంట్‌ ప్రభావతి తెలిపారు. సర్వజనాసుపత్రిలో శనివారం పసిబిడ్డల్లో వినికిడి లోపం ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ విభాగంలో నిర్వహించిన సదస్సులో ప్రభావతి మాట్లాడుతూ తొలిరోజు మొత్తం 18 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఐదుగురికి శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుందని తెలిపారు. వినికిడి లోపం ఉంటే వాళ్లకు మాటలు కూడా రావన్నారు. చివరికి వాళ్లు ‘మూగ-చెవిటి’గా మిగిలిపోతారన్నారు. అందువల్ల ఉచితంగా నిర్వహించే ఈ పరీక్షలకు అర్హులైన చిన్నారులను తీసుకు రావాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎంతోమంది పసిబిడ్డలను చెవిటి-మూగ అవస్థల నుంచి బయట పడేస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను తొలిసారి జీజీహెచ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యంత ఖరీదైన ఈ శస్త్రచికిత్సలను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సర్జరీల నిర్వహణకు అవసరమైన రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను హైదరాబాద్‌కు చెందిన సాహి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ విజయకుమార్‌ అపోలో ఆసుపత్రి సహకారంతో ఈఎన్‌టీ విభాగానికి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టి.రాజేంద్రప్రసాద్‌, సహాయ ఆచార్యులు పి.వి.సంపత్‌కుమార్‌, సి.అనిత, సి.అరుణకుమార్‌, సీఎస్‌ఆర్‌ఎంవో సతీశ్‌కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మంజు తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని