786 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
eenadu telugu news
Published : 24/10/2021 06:05 IST

786 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 786 మిడ్‌-లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి శనివారం ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఒప్పంద విధానంలో జరిగే ఈ నియామకాలకు బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీని ‘6 నెలల కమ్యూనిటీ హెల్త్‌’ సర్టిఫికెట్‌ కోర్సుతో పూర్తిచేసి ఉండాలని నూతనంగా నిబంధన విధించారు. గతంలో బీఎస్సీ డిగ్రీని అర్హతగా పేర్కొని అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇగ్నో ద్వారా ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సును పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించారు. కిందటేడాది నుంచి సర్టిఫికెట్‌ కోర్సు పాఠాలను నర్సింగ్‌ డిగ్రీ సిలబస్‌లో కలిపారు. దీంతో ఇగ్నో కోర్సు అవసరం లేకుండా చేశారు. డిగ్రీ మార్కులను బట్టి ఎంపిక చేసే వీరిని ఉప ఆరోగ్యకేంద్రాల్లో నియమించనున్నారు. నవంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రాథమిక మెరిట్‌ జాబితాను అదే నెల 10న ప్రకటించి, అభ్యంతరాలుంటే 12 వరకు స్వీకరిస్తారు. ప్రతిభ ఆధారంగా తుది జాబితాను 15న ప్రకటించి, 19న ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. ఈ ఎంపికపై అభ్యంతరాలంటే 21 వరకు స్వీకరించి, ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను 24న ప్రకటిస్తారు. 27 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉప ఆరోగ్య కేంద్రాలను కేటాయిస్తారు. hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని