గుట్కా తయారీ స్థావరంపై దాడి
eenadu telugu news
Published : 24/10/2021 06:05 IST

గుట్కా తయారీ స్థావరంపై దాడి


నిందితుల వివరాలు తెలుపుతున్న ఏఈఎస్‌ మణికంఠ తదితరులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గుంటూరు రైలుపేటలో రహస్యంగా గుట్కా తయారు చేస్తున్న స్థావరంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ (సెబ్‌) పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. సెబ్‌ ఏఈఎస్‌ మణికంఠ ముఠా సభ్యుల వివరాలను తెలిపారు. గుట్కా తయారు చేస్తున్నారని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు సమాచారం మేరకు సెబ్‌ జేడీ బింధుమాధవ్‌ ఆధ్వర్యంలో ఈఎస్‌ అన్నపూర్ణ, ఏఈఎస్‌ మణికంఠ, సెబ్‌ గుంటూరు 1 సీఐ రమేష్‌, ఎస్సైలు శ్రీనివాసరావు, నరసింహతోపాటు ఎస్పీ కార్యాలయ ప్రత్యేక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. రైలుపేటలోని నడింవారిపల్లిలో పాతభవనం మూడో అంతస్తులో రహస్యంగా గుట్కా తయారు చేయడాన్ని గుర్తించారు. యంత్రాలు, ముడిసరకు, ప్లాస్టిక్‌ కవర్లు, జరదా డబ్బాలు గుర్తించారు. నిందితులు సురేష్‌, నస్రీన్‌, హుస్సేన్‌బీలను అదుపులోకి తీసుకొని విచారించారు. రైలుపేటకు చెందిన హరిబాబు వీటిని తయారు చేయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. ఆరు నెలలుగా వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దిల్లీ నుంచి పొగాకు ముడిసరకును బీడీలు, సిగరెట్లతో కలిపి పార్సిల్‌ కార్యాలయాల ద్వారా గుంటూరుకు దిగుమతి చేసుకొని అక్కడ గుట్కాలు తయారు చేస్తున్నట్లు తేలిందన్నారు. తయారైన వాటిని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరుకు రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. రూ.5.75 లక్షల విలువ చేసే ముడిసరకు, తయారీ యంత్రాలను జప్తు చేశామన్నారు. ప్రధాన నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నాడని ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని