అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం
eenadu telugu news
Published : 24/10/2021 06:05 IST

అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం


మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

నారాయణపురం(దాచేపల్లి), న్యూస్‌టుడే: రెండున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం నారాయణపురంలో యరపతినేని మాట్లాడుతూ తెదేపా శ్రేణులపై దాడులు చేయడం, పోలీసు నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరి అధికారంలోకి వచ్చిన పిల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించలేక చేతులెత్తేసినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయిన వైకాపా నాయకులు అక్రమంగా మట్టి, మద్యం, సారా, గంజాయి, ఇసుక, మైనింగ్‌ వ్యాపారాలు, రెవెన్యూ భూములకు పట్టాలు సృష్టించి కాజేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటికీ సహకరిస్తున్న రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు సమాధానం చెప్పాల్సిన అవసరముందని యరపతినేని ధ్వజమెత్తారు. చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వనరులను దోచుకుంటూ ప్రజలకు నరకయాతన చూపిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఓటుతో అరాచక ప్రభుత్వాన్ని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెదేపా శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని కోరారు. తెదేపా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గుంటుపల్లి నాగేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు బెల్లంకొండ చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు షేక్‌ అహమ్మద్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని