సర్దుబాటుకు రంగం సిద్ధం
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

సర్దుబాటుకు రంగం సిద్ధం

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల రాకతో డీఎస్సీపై ప్రభావం?

ఈనాడు-అమరావతి

 

ఎయిడెడ్‌ పాఠశాలలు నడపలేమని సంబంధిత యాజమాన్యాలు ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేయటానికి రంగంసిద్ధమైంది. సీనియారిటీని ఆధారంగా చేసుకుని జాబితాను తయారు చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ సంబంధిత ఉపాధ్యాయులను కోరింది. జిల్లా వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది అందరూ కలిపి 629 మంది ఇప్పటి దాకా మండల విద్యాశాఖ అధికారుల వద్ద రిపోర్టు చేశారు. వీరిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో సర్దుబాటు చేయటానికి కసరత్తు జరుగుతోంది. పోస్టులతో సహా వీరిని ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం సాధారణ బదిలీలు చేసేటప్పుడు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. వీరికి కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని,

ప్రస్తుతం వీరిని పోస్టులతో సహా బదిలీలు చేస్తే రెగ్యులర్‌ ఉపాధ్యాయులు కోర్టుకెళ్లి వాటిని నిలుపుదల చేయిస్తారని భావించి ప్రస్తుతానికి తాత్కాలింగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడకు వారిని సర్దుబాటు చేయాలనేది శాఖ ఆలోచన. దీనివల్ల జిల్లాలో చాలా వరకు ఉపాధ్యాయుల కొరత అనే సమస్య ఉత్పన్నం కాదని విద్యాశాఖవర్గాలు వెలిబుచ్చాయి. ఇంతకు ముందే టీచర్‌-పిల్లల నిష్పత్తి ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టగా సుమారు 1100 ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు 629 మంది రానుండటంతో చాలా వరకు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ అయినట్లేనని భావిస్తున్నారు.

తగ్గనున్న పోస్టులు?

ఎయిడెడ్‌ విద్యా సంస్థల నుంచి ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవటం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికభారం ఉండదు. ఆపై వీరి రాకతో ఇప్పటికిప్పుడు తిరిగి డీఎస్సీ నియామకాలు చేపట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా ఉపాధ్యాయుల పదవీ విరమణ ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి డీఎస్సీ నోటిఫికేషన్‌లో చేరుస్తారు. ఈ ఖాళీల్లో 30 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా మిగిలిన 70 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వ గొడుగు కిందకు రానుండటంతో ఆమేరకు డీఎసీ్సీలో భర్తీ చేయాల్సిన పోస్టులు తగ్గిపోనున్నాయి. ఎయిడెడ్‌ ఉద్యోగులు ప్రభుత్వ గొడుగు కిందకు రావటం వల్ల ఇకమీదట డీఈఓ కార్యాలయంలో రెండు సెక్షన్లను ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.

28 మంది హెచ్‌ఎంలకు ఊరట

ఉపాధ్యాయులు, ఇతర నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేయనున్న విద్యాశాఖ ప్రధానోపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ,వారిని నేరుగా పోస్టులతో సహా ఉన్నతీకరించిన(అప్‌గ్రేడ్‌) ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయనుండటం హెచ్‌ఎంలకు ఊరటనిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులకు ఈనిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. మిగిలిన 601 మంది ఉపాధ్యాయులను డీఎసీ్సీకి గుర్తించిన ఖాళీల్లో తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేస్తారని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న నాన్‌టీచింగ్‌ సిబ్బందని హైస్కూళ్లకు కేటాయించాలని పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేత మణి కోరారు. జిల్లాలో 340 ఉన్నత పాఠశాలలకు గానూ 145 స్కూళ్లల్లో కనీసం గంట కొట్టేవారు లేరని రికార్డు అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, అటెండర్లు లేక అన్ని విధులను ప్రధానోపాధ్యాయులే చేసుకుంటున్నారని వాపోయారు.

క్యాడర్‌ వారీగా 629 ఖాళీలు

హెచ్‌ఎంలు 28, స్కూల్‌ అసిస్టెంట్లు సైన్సు 27, తెలుగు-15, హిందీ-18, ఎన్‌ఎస్‌ 3, లాంగ్వేజ్‌ పండిట్లు(హిందీ)10, తెలుగు 2, పీఈటీ 20, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 340, ఉర్దూ 1, క్రాఫ్ట్‌ 8, మ్యూజిక్‌ 2, డ్రాయింగ్‌ 8, జూనియర్‌ అసిస్టెంట్టు 33, రికార్డ్‌ అసిస్టెంట్లు 28, ల్యాబ్‌ అసిస్టెంఫ్‌ 1, అటెండర్లు 14, గార్డినర్‌ 2, రాత్రి కాపలాదారులు 2, స్వీపర్‌ 1.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని