‘వైకాపా దాడులకు భయపడేది లేదు’
eenadu telugu news
Updated : 25/10/2021 05:50 IST

‘వైకాపా దాడులకు భయపడేది లేదు’

లాడ్జి సెంటర్‌లో నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రవీంద్ర

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు పోలీసులతో కుమ్మక్కై చేస్తున్న దాడులకు భయపడే ప్రసక్తే లేదని గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా నాయకులు చేసిన దాడులకు నిరసనగా లాడ్జి సెంటర్‌లో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందమూరి  ఆడపడుచులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చిత్రపటాన్ని తెలుగు మహిళలు చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు. వంశీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రవీంద్ర మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు? తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి కర్రలు, రాడ్లుతో సిబ్బందిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే బెయిల్‌ ఇచ్చి పంపడం దుర్మార్గం. దీనికి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సమాధానం చెప్పి తీరాలి. ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఏవిధంగా మసలుకోవాలో నేర్చుకోవాలి. అధికారం చేతిలో ఉందని విర్ర వీగితే భవిష్యత్తులో అధికారం కోల్పోయాక పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి. అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని’.. పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, నాయకులు పిల్లి మాణిక్యరావు, సుఖవాసి శ్రీనివాసరావు, వడ్రాణం హరిబాబు, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీకృష్ణ, ఈరంటి వరప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, నూకవరపు బాలాజీ, కసుకుర్తి హనుమంతురావు, షేక్‌ చినబాజి, దాసరి జ్యోతి, నేపాక పద్మావతి, పేరం అనిత, లంకా మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని