ఇంజినీరింగ్‌ప్రవేశాలకు వేళాయె
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

ఇంజినీరింగ్‌ప్రవేశాలకు వేళాయె

నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం
మూడు సహాయ కేంద్రాల ఏర్పాటు
ఈనాడు, అమరావతి

ప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ విద్యలో ప్రవేశాలకు సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది విద్యార్థులకు ఊరటనిస్తోంది. జిల్లాలో దీనికి సంబంధించి ఏఎన్‌యూ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల, నల్లపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, నరసరావుపేట జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడింటిని హెల్ప్‌ లైన్‌ కేంద్రాలుగా గుర్తించారు. ఎప్పటిలాగే వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ విధానంలోనే ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తొలిసారిగా రిజిస్ట్రేషన్‌ నమోదు, ధ్రువపత్రాల పరిశీలన మొత్తం కూడా ఈసారి ఆన్‌లైన్‌లో చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి సూచించిన వెబ్‌సైట్‌లో విద్యార్థులు నిర్దేశిత ఫీజు రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈఏపీసెట్‌లో కేటాయించిన హాల్‌టిక్కెట్‌ నంబరు, పుట్టిన తేదీతోనే లాగిన్‌ అయి నిర్దేశిత సైట్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేసి వాటిని వెరిఫై చేశారా? లేదా అనేది పరిశీలించుకోవాలి. సోమవారం నుంచి ఈ నెల 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ జారీ చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్‌ కోసం ఓసీ, బీసీ విద్యార్థులైతే రూ.1200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 ఆన్‌లైన్‌లో రుసుములు చెల్లించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఏ విద్యార్థివి అయినా పత్రాలు పరిశీలించకపోతే వారు నేరుగా జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ కేంద్రాలను సంప్రదించాలి. అక్కడే వారివి పరిశీలిస్తారు. అదేవిధంగా బోధనా రుసుములకు అర్హులా? కాదా అనేది కూడా ఈ పరిశీలనలోనే తెలుస్తుంది. ఒకవేళ పొరపాటున ఏ విద్యార్థికైనా బోధనా రుసుములకు బదులు ఎన్నారై కోటానో లేదా పేమెంట్‌ కోటా అని పడితే వాటిని విద్యార్థులే గుర్తించి ఇప్పుడే సరి చేయించుకోవాలి. ఆన్‌లైన్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి మార్పు, చేర్పులకు అవకాశం ఉండదు. ఈ దృష్ట్యా ముందుగానే విద్యార్థులు బోధనా రుసుముల పథకం వర్తించడానికి అవసరమైన అన్ని పత్రాలను ప్రవేశాల సమయంలోనే చూపించాలని ఇంజినీరింగ్‌ కళాశాల వర్గాలు సూచించాయి.


18వేల సీట్లు

జిల్లాలో 40 ఇంజినీరింగ్‌ కళాశాలలు, రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో అన్ని బ్రాంచీల్లో కలిపి 18వేల దాకా సీట్లు ఉన్నాయని ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాల సంఘం నాయకులు కోయ సుబ్బారావు, పెరుమాళ్లు తెలిపారు. నవంబరు ఒకటి నుంచి 5వ తేదీ వరకు విద్యార్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి. 6న వాటిల్లో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. 10న సీట్లు కేటాయింపు చేస్తారు. సీట్లు వచ్చిన కళాశాలకు వెళ్లి విద్యార్థులు నవంబరు 10 నుంచి 15వ తేదీ లోపు రిపోర్టు చేసుకోవాలి. 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

హెల్ప్‌లైన్‌ కేంద్రాలివి..
1. ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, నల్లపాడు, గుంటూరు
2. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
3. జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, నరసరావుపేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని