సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

సంక్షిప్త వార్తలు

పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్‌ వ్యాయామశాలలో సాధన చేస్తున్న పలువురు లిఫ్టర్లు జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారని వ్యాయామశాల శిక్షకుడు బి.సందీప్‌ తెలిపారు. ఈ నెల 23వ తేదీన చిల్లకల్లులో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌, మాస్టర్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో.. ఎస్‌.చంద్రకళ-76 కేజీల కేటగిరీ సీనియర్‌ మహిళల విభాగంలో మొత్తం 520 కేజీల బరువెత్తి ఎక్విప్డ్‌, అన్‌ ఎక్విప్డ్‌లో రెండు పసిడి పతకాలు కైవసం చేసుకోవడంతో పాటు ‘జిల్లా సీనియర్‌ స్ట్రాంగ్‌ ఉమెన్‌’ టైటిల్‌ను చేజిక్కించుకుంది. కరీమ్‌ అహ్మద్‌ బేగ్‌ -93 కేజీల కేటగిరీ సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో తలపడి మొత్తం 535 కేజీల బరువెత్తి ఎక్విప్డ్‌, అన్‌ ఎక్విప్డ్‌లో నాలుగు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. నీలం మణిశ్రావణి 84+ కేటగిరీ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో తలపడి మొత్తం 410 కేజీల బరువెత్తి ఎక్విప్డ్‌, అన్‌ ఎక్విప్డ్‌లో ఆరు పసిడి పతకాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన లిఫ్టర్లను రైల్వే ఇనిస్టిట్యూట్‌ కార్యదర్శి ఆకుల రాఘవేంద్రరావు, జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ సంఘం కార్యదర్శి గంటా వెంకటేశ్వర్లు అభినందించారని ఆయన తెలిపారు.


‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : దేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, అలాగే రాష్ట్రంలో సంఘీయులను సైతం చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలుగల్లు కమ్మన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 ఏళ్లుగా రజకుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘీయుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలని, కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని, విశాఖలో అత్యాచారం, హత్యకు గురైన రజక బాలిక కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఆయన కోరారు.


‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు విమర్శించారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ ఆత్మగౌరవ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు కామన్‌ సర్వీసు రూల్స్‌ తీసుకురావడంలో విఫలమవ్వడమే కాకుండా, ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్తవి సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఒక నాన్‌ టీచింగ్‌ ఉద్యోగి విద్యా శాఖలో లాస్ట్‌ క్యాడర్‌లో చేరినా.. జిల్లా అధికారి కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎస్జీటీ నుంచి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వరకు మధ్యలో ఉన్న అన్ని పదోన్నతులు టీచర్లకే ఇవాల్వని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు, అరవపాల్‌, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వం దృష్టికి పెయింటర్ల సమస్యలు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వం పెయింటర్ల సమస్యలు గుర్తించి, ఆర్థిక భృతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్టిస్ట్స్‌ అండ్‌ పెయింటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కాలె సురేష్‌ కుమార్‌ కోరారు. ఆదివారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ కళాకార్‌ సంఘ్‌కు అనుబంధంగా రాష్ట్రంలో అసోసియేషన్‌ ఏర్పడిందని, ఇందులో భాగంగానే జిల్లా నూతన కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ నెల 10న ఎమ్మెల్యే విష్ణుని కలిసి సమస్యలను వివరించగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. జిల్లా నూతన కమిటీలో తాను అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బి.ఎల్లారావు, గౌరవాధ్యక్షులుగా పి.ప్రసాదరావు, లాం వర్థనరావు, జె.ఎల్‌.శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులుగా పరిమి రామకృష్ణ తదితరులు నియమితలైనట్లు సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రెడ్డిపల్లి నరసింహులు, టి.పద్మారావు, పి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సి.హెచ్‌.బాబూరావు ఆదివారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవల తిరుపతి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద ఓ మహిళ వాహనంలో ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడం దయనీయం అన్నారు. వర్షపు నీటి కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం, పాలకుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఆయన విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని