భర్త అడ్డుతొలగించుకోవాలని కిరాయి హత్య
eenadu telugu news
Updated : 25/10/2021 11:52 IST

భర్త అడ్డుతొలగించుకోవాలని కిరాయి హత్య

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలసి పథకం పన్ని భర్తను హత్య చేయించింది. ఈ నెల 6న రాజమహేంద్రవరంలో ఓ గూడ్స్‌ వ్యానులో విజయవాడ ఆటోనగర్‌ ప్రాంతానికి చెందిన వి.రాము(40) అనుమానాస్పద మృతి కేసును బొమ్మూరు పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు మినహా మిగిలిన అయిదుగురిని సీఐ లక్ష్మణరెడ్డి, ఎస్సై జగన్‌మోహన్‌ ఆదివారం అరెస్టు చేశారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం... హత్యకు గురైన రాముకు గూడ్స్‌ వ్యాను ఉండడంతో అద్దెకు తిప్పుతుంటాడు. ఇతనికి భార్య భవానీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి ఈ కుటుంబానికి దగ్గరి బంధువు. రాము భార్య భవానీ, ప్రసాద్‌ల మధ్య కొంతకాలంగా వివాహేతర బంధం నడుస్తోంది. విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో రాము అడ్డు తొలగించుకోవాలని భావించారు. విజయవాడ అరండల్‌పేటకు చెందిన ఎస్‌.కనకరాజు, ఎ.వెంకట సాయికృష్ణ, బుకింగ్‌పేటకు చెందిన ఫిరోజ్‌, ఉయ్యూరు ప్రాంతానికి చెందిన సయ్యద్‌ బాజీ అనే వ్యక్తులతో రామును హత్య చేయించేందుకు రూ.80 వేలకు ప్రసాద్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశాఖపట్నం నుంచి విజయవాడకు లోడు తీసుకురావాలని చెప్పి రాముతో ఆ నలుగురు కిరాయి మాట్లాడుకుని ఈ నెల 4న మధ్యాహ్నం విజయవాడ ఆటోనగర్‌ నుంచి బయలుదేరారు. రాత్రికి మార్గమధ్యలో అంతా మద్యం తాగారు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం కెనాల్‌ రోడ్డులో వ్యానును నిలిపి వ్యానులో ఉన్న టార్పాలిన్‌ కవరును మద్యం మత్తులో ఉన్న రాము ముఖానికి చుట్టి ఊపిరందకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని వ్యానులో ఉంచి దివాన్‌చెరువు గైట్‌ కళాశాల సమీపంలో వదిలేసి పరారయ్యారు. హత్యకు ప్రధాన సూత్రధారి ప్రసాద్‌ పరారీకాగా భవానీ, హత్య చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని