సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

సంక్షిప్త వార్తలు

తల్లిని పరామర్శించి వస్తూ.. అనంతలోకాలకు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కుమార్తె దుర్మరణం పాలైన సంఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్‌ మెహబూబ్‌ఉన్నిసా(38) తల్లి షేక్‌ కరీమున్నీసా అనారోగ్యానికి గురై రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు సోదరి షేక్‌ మహ్మద్‌నెహ్రూన్‌, ఆమె కుమారుడు ఫూర్‌ఖాన్‌తో కలిసి మెహబాబ్‌ఉన్నిసా రాజమండ్రి వెళ్లారు. కారులో ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో విమానాశ్రయం ప్రధాన ద్వారానికి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరి కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో మెహబూబ్‌ఉన్నిసా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరితోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.


ప్రభుత్వాన్ని మోసగించిన కేసులో ఏడాది జైలు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక అందించే క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసగించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు, రూ.30 వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి యు.రామమోహన్‌ సోమవారం తీర్పు చెప్పారు. వెలుగు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, అడిషనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు మీసేవ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో గుంటుపల్లిలోని నక్షత్ర కమ్యూనికేషన్‌ సెంటర్‌లో అక్రమాలు జరుగుతున్నట్లుగా అధికారులకు ఫిర్యాదుల అందాయి. 2014, డిసెంబరు 4న అప్పటి వెలుగు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, అడిషనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. ఆ సెంటర్‌ నిర్వాహకుడు కల్లం రాజశేఖర్‌ ప్రజల నుంచి క్యూబిక్‌ ఇసుకకు రూ.650 చొప్పున మూడు క్యూబిక్‌ మీటర్ల ఇసుక కోసం రూ.1950లు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కస్టమర్‌లకు అదనంగా 12 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఇస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించేవాడు. వారి నుంచి రూ.7825 వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించకుండా తన సొంతానికి వాడుకునేవాడు. ప్రభుత్వానికి 3 క్యూబిక్‌లకు గాను రూ.1950 చెల్లించేవాడు. ఇలా 45 క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు నకిలీ పత్రాలు సృష్టించి, రూ.29,250 నగదు ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిని అరెస్టు చేసి, కంప్యూటర్‌, ప్రింటర్‌, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపరచగా, ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ హమీద్‌ వాదనలు వినిపించారు. ఇబ్రహీంపట్నం గుంటుపల్లికి చెందిన నిందితుడు కల్లం రాజశేఖర్‌పై నేరారోపణ రుజువు కావడంతో ఏడాది జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు.


సంపూర్ణ గృహ హక్కుతో బహుళ ప్రయోజనాలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వోటీఎస్‌) ద్వారా లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు లభిస్తాయని కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రిజిష్టరు డాక్యుమెంట్లు వస్తాయని, బ్యాంకు రుణాలు పొందడం, డాక్యుమెంటు బదిలీ, విక్రయం లేదా లీజుకు ఇవ్వడానికి హక్కులు వస్తాయన్నారు. వోటీఎస్‌ పథకం కింద నాలుగు కేటగిరిల్లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని ఆయన సూచించారు.


ఒప్పంద ఆచార్యులను ఆదుకోండి

అలంకార్‌కూడలి(విజయవాడ): విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద ఆచార్యులకు కనీస మూల వేతనం అమలు చేయాలని కోరుతూ ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఛైర్మన్‌ ఎ.వి.నాగేశ్వరరావు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సోమవారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. జీవో ఎంఎస్‌ నెం.40 ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు మూలవేతనం అమలు చేయాలని అధికారులు సిఫారుసు చేసినా, ప్రయోజనం లేదన్నారు. జీవో ఎంఎస్‌ నెం.12 ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న వారికి మూలవేతనం అమలు చేయాలని ఆదేశించినా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి మినిమం టైం స్కేల్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


నేడు ధ్రువ పత్రాల పరిశీలన

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: జిల్లాలో పదోన్నతులకు అర్హత సాధించిన ఉపాధ్యాయులందరూ ఈనెల 26వ తేదీ మంగళవారం మచిలీపట్నంలోని జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈవో తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పాఠ్యాంశాల వారీగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని, వారంతా ఉదయం 10 గంటలకల్లా ధ్రువపత్రాలు తీసుకుని రావాలని చెప్పారు.


‘దేశవ్యాప్త కుల గణన అవసరం’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : దేశ వ్యాప్తంగా కుల గణన జరగాల్సిన అవసరం ఉందని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తామని ప్రమాణం చేసే రాజకీయ నాయకులు రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ కార్పొరేషన్‌ పదవుల్లో ఒకే వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఆయా కార్పొరేషన్లకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. నిజాయతీగా పని చేసే అధికారులను బదిలీలు చేస్తూ, అవినీతికి పాల్పడేవారిని అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి కిరణ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు శివరామ్‌, అలా వీరు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


మెరుగైన వైద్య సేవలందించాలి

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జాతీయ బృందం పరిశీలకురాలు డాక్టర్‌ గీతాసింగ్‌ వైద్య సిబ్బందికి సూచించారు. తోట్లవల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల పరిశీలన బృందం పరిశీలించింది. సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆసుపత్రి పనితీరు గురించి వివరించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. బృందం సభ్యురాలు పి.రేవతి, పీహెచ్‌సీ డాక్టర్లు విజయరత్నకుమార్‌, సాయిప్రసన్న, మమత తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని