ఫీజు కట్టలేదని బాలుడి గెంటివేత?
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

ఫీజు కట్టలేదని బాలుడి గెంటివేత?

విచారణ కమిటీని నియమించిన డీఈవో

పాఠశాలకు వచ్చిన విచారణ కమిటీ సభ్యులు

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సెయింట్‌ జోసఫ్‌ ప్రైవేట్‌ పాఠశాల ఆవరణలో చెట్టు కింద ఫీజు చెల్లించ లేదని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఒకటో తరగతి విద్యార్థి వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో డీఈవో గంగాభవాని స్పందించారు. దీనిపై నిగ్గు తేల్చాని ఇన్‌ఛార్జి ఎంఈవో రాజకుమారిని ఆదేశించారు. ఆమె అల్లంవారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు డానియేల్‌, ఉపాధ్యాయుడు రాజు, ఫిరంగిపురంలోని శాంతిపేట ఎంపీపీ స్కూలు ఉపాధ్యాయుడు షేక్‌ అబ్దుల్‌రజాక్‌తో విచారణ కమిటీ నియమించారు. కమిటీ సభ్యులు సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌కు వెళ్లి విద్యార్థి, అక్కడి టీచర్లను విచారించారు. అనంతరం కమిటీ సభ్యుడు డానియేల్‌, సెయింట్‌ జోసఫ్‌ స్కూలు ఉపాధ్యాయులు విలేకరులకు వివరాలు తెలిపారు. హౌస్‌గణేష్‌ గ్రామానికి చెందిన ఆరేళ్ల విద్యార్థి సెయింట్‌ జోసఫ్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ ఇంటి నుంచి ఆటోలో బడికి వస్తుంటాడు. ఈ విద్యా ఏడాదికి రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉండగా రూపాయి చెల్లించలేదు. బాబు ఆరోగ్యం బాగోలేదని మూడు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం బాబు తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఫీజు కడతామని, బడికి వెళ్లమని నచ్చజెప్పి పంపారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనికి వెళ్లకుండా ఆరు బయట కూర్చొని ఉన్నాడు. కాసేపటికి విద్యార్ధి బాబాయ్‌ స్కూల్‌కు వచ్చి రూ.5 వేలు ఫీజు కట్టారు. ఈలోగా విద్యార్థి బడి ఆవరణలో ఆరుబయట కూర్చొని ఉన్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసినట్లు కమిటీ సభ్యులు వివరించారు. ఎంఈవో రాజకుమారి మాట్లాడితే విచారణ కమిటీ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలుంటాయన్నారు. విద్యార్థి ఆరుబయట కూర్చోడానికి, ఫీజు కట్టడానికి ఎలాంటి సంబంధం లేదని సెయింట్‌ జోసఫ్‌ స్కూలు ప్రతినిధులు విలేకరులకు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని