తొమ్మిదో తరగతి విద్యార్థిబలవన్మరణం
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

తొమ్మిదో తరగతి విద్యార్థిబలవన్మరణం

మృతిపై బంధువుల్లో అనుమానాలు

శ్రీనాథ్‌ బతికే ఉన్నాడు.. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తామని పోలీసులతో బంధువుల వాగ్వాదం

లాడ్జిసెంటర్‌, నగరంపాలెం (గుంటూరు), న్యూస్‌టుడే: తొమ్మిదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు గ్రామీణ మండలం పెదపలకలూరులోని నారాయణ పాఠశాలలో చోటుచేసుకుంది. నల్లపాడు ఎస్సై ఆరోగ్యరాజు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన జక్కా శ్రీనాథ్‌ (14) మూడేళ్లుగా నారాయణ పాఠశాల వసతిగృహంలో ఉంటూ అక్కడే చదువుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున తోటి విద్యార్థులు నిద్ర లేచి చూసేటప్పటికి పంకాకు ఉరి వేసుకుని ఉన్నాడు. వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లగా సమీపంలోని ప్రైవేటు అసుపత్రికి, అక్కడ నుంచి జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం మృతి చెందాడని వైద్యులు చెప్పారు. పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు చెప్పడంతో వారు జీజీహెచ్‌ వద్దకు చేరుకున్నారు. అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చదువులో ప్రతిభ కనబరిచే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తమకు పాఠశాల సిబ్బంది ఐదు గంటల సమయంలో ఫోన్‌ చేశారని విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సంధ్య తెలిపారు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లాడాని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీరుమున్నీరుగా రోదించారు. గతంలో ఫీజు విషయంలో పాఠశాల సిబ్బంది బాబును ఇబ్బంది పెట్టారని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శ్రీనాథ్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని పాఠశాల ప్రిన్సిపల్‌ జానకిరామ్‌ తెలిపారు. రెండు రోజులు నుంచి అతను నలతగా ఉంటున్నాడని, ముందు రోజు అతని తండ్రితో ఫోన్లో మాట్లాడాడని చెప్పారు. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్నారు. ఇరువర్గాల చెప్పిన వివరాల మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు ఎస్సై తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఒక పార్టీ ప్రధాన నాయకుడి బంధువులు కావడంతో వారు కూడా రంగంలోకి దిగారు.

జీజీహెచ్‌ వద్ద ఆందోళన
తమ కుమారుడు చనిపోలేదని, బతికే ఉన్నాడని శవాగారంలో పెట్టేందుకు వీలులేదని అతని తల్లిదండ్రులు జీజీహెచ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈసీజీ తీసి మృతి చెందాడని ధ్రువీకరించినా వారు అంగీకరించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకోంది. పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నించినా వారు ఆందోళన విరమించలేదు. తమకు నగరంలో తెలిసిన ప్రైవేటు వైద్యుడు ఉన్నారని, అతనితో పరీక్ష చేయించాలని కోరారు. అతను వచ్చి పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు. బాలుడు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు వసతిగృహ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహావేశానికి గురైన అతని కుటుంబ సభ్యులు చేయి చేసుకున్నారు. బాబు చనిపోవడానికి పాఠశాల యాజమాన్యమే కారణమని, బాబు ఉరి వేసుకున్న విషయం తమకు ఆలస్యంగా తెలియజేశారని బోరుమన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మృతదేహాన్ని శవాగారానికి తరలించారు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని