కీచకులు
eenadu telugu news
Updated : 26/10/2021 06:25 IST

కీచకులు

మహిళను బలాత్కరించి రెండో పెళ్లి
ఆమె కుమార్తెతో అసభ్య ప్రవర్తన

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: స్నేహితుడి ముసుగులో పరిచయమైన ఒక కానిస్టేబుల్‌ తనను బలాత్కరించి రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా తన కుమార్తె పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు గుంటూరుకు చెందిన ఒక వివాహిత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాగా పని చేశారు. ఆమెకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఎనిమిదేళ్ల కిందట మృతి చెందారు. ఆసుపత్రికి ఖైదీలను ఆరోగ్య పరీక్షలకు తీసుకొచ్చే క్రమంలో ఒక కానిస్టేబుల్‌ స్నేహితుడిగా పరిచయమయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బలాత్కరించి లోబరచుకున్నాడు. విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. కొన్నాళ్ల తర్వాత అతని స్నేహితులను తీసుకొచ్చి ఆమె కుమార్తె పట్ల అసభ్యప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే మరోసారి అలా చేయనని నమ్మించాడు. కుటుంబానికి అండగా ఉంటానని 2019లో విజయవాడలోని ఒక ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత తాను చెప్పినట్లు వినకపోతే ఆమె పిల్లలకు హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు ఉపయోగించిన సూది గుచ్చి ఎయిడ్స్‌ వ్యాధితో మరణించేలా చేస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలు, ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రశ్నిస్తే తాను పోలీసునని, తనను ఏమీ చేయలేరని బెదిరిస్తున్నాడని.. ఇందుకు సంబంధించిన కొన్ని కాల్‌ రికార్డులు ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకుని ప్రాణ రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


లైంగిక వాంఛ తీర్చమని బావ బెదిరింపు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: లైంగిక వాంఛ తీర్చమంటూ బావ బెదిరిస్తున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘మేడికొండూరు మండలానికి చెందిన తనకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పదేళ్ల కిందట వివాహమైంది. కుమారుడు ఉన్నాడు. భర్త బయటకు వెళ్లిన సమయంలో బావ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. లైంగిక వాంఛ తీర్చమంటూ బెదిరించేవాడు. ఈ విషయాన్ని భర్త, అత్తమామలకు చెబితే అతనికే మద్దతు పలికారు. నాపై దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో భర్త, అత్తమామలపై కేసు పెట్టాను. కోర్టులో ఉండగా భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్తకు బావ విషమిచ్చి చంపి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నాకు, నా బిడ్డకు న్యాయం చేస్తానంటూ నమ్మించి పెద్ద మనుషుల ద్వారా ఒత్తిడి చేశాడు. భర్తకు చెందాల్సిన ఆస్తిలో సగం నా బిడ్డకు ఇచ్చేలా ఒప్పందం చేయించి లోక్‌ అదాలత్‌లో రాజీ పత్రాలపై సంతకాలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత నుంచి మళ్లీ లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ఏ లోటు లేకుండా చూసుకుంటానని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. లైంగిక వాంఛ తీర్చాలని.. లేకపోతే ఆస్తి రాకుండా చేయడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. లొంగకపోతే చంపాలని చూస్తున్నాడు. ఆస్తి కాజేయడానికి కుట్ర పన్నుతున్న అతనిపై చర్యలు తీసుకుని నాకు, నా బిడ్డకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరానని’ బాధితురాలు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని