తెనాలి డీవైఈఓ ఎవరు?
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

తెనాలి డీవైఈఓ ఎవరు?

వేర్వేరుగా ఇద్దరికి నియామక ఉత్తర్వులు
ఈనాడు-అమరావతి

జిల్లాలో తెనాలి ఉపవిద్యాశాఖ అధికారి(డీవైఈఓ) నియామకం విషయంలో పాఠశాల విద్యాశాఖ వర్సెస్‌ ఓ ప్రజాప్రతినిధి అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. దీనికి సంబంధించి సోమవారం అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆ పోస్టులో డీఈఓ కార్యాలయంలో ఏడీ-2గా పనిచేస్తున్న నారాయణరావును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందే ఇదే పోస్టులోకి కమిషనర్‌ ముందస్తు అనుమతి లేకుండా ఒంగోలు డైట్‌కళాశాలలో పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమిస్తూ గుంటూరు ఆర్జేడీ ఉత్తర్వులు జారీచేయటంతో ఈ నెల 22న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదే పోస్టులోకి తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి నారాయణరావును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న కిరణ్కుమార్‌ను ఎవరు ప్రతిపాదిస్తే నియమించారు? కమిషనర్‌ ముందస్తు అనుమతి లేకుండా నియామకం చేసి, దాన్ని ర్యాటిఫికేషన్‌కు పంపటం వంటివి ప్రస్తుతం డైరెక్టరేట్‌లో చర్చనీయాంశమవుతున్నాయి. ఉత్తర్వులు అందుకున్న నారాయణరావు ఆ పోస్టులోకి వెళ్లడానికి సిద్ధమవగా ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకున్నట్లు సమాచారం. రాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగింది.

గతంలోనే ప్రతిపాదనలు పంపిన డీఈఓ
ఇంతకుముందే తెనాలి డీవైఈఓ పోస్టులోకి డీఈఓ కార్యాలయంలో ఏడీ-1గా పనిచేస్తున్న సంధాని, ఏడీ-2 నారాయణరావు, మధ్యాహ్న భోజన పథకం ఏడీ, ఆర్జేడీ కార్యాలయంలో ఉండే మరో ఏడీ రవిసాగర్‌ మొత్తం నలుగురి పేర్లతో డీఈఓ గంగాభవానీ గతంలోనే కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఆ దస్త్రం అలా ఉందని తెలిసినా జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కిరణ్‌కుమార్‌ నియామకానికి దస్త్రం పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరికి నియామక ఉత్తర్వులు ఇవ్వటంతో వీరిలో ఎవరు డీవైఈఓ అనేది ప్రశ్నార్థకంగా మారింది. కి¨రణ్‌కుమార్‌ను ప్రస్తుతం వెనక్కు పంపుతారా? నారాయణరావును ఆగమంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కిరణ్‌కుమార్‌ను కొనసాగించాల్సిందేనని సోమవారం రాత్రి నుంచి సదరు ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నట్లు సమాచారం. దీనిపై డీఈఓ గంగాభవానీని సంప్రదించగా నారాయణరావును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. గతంలోనే నలుగురు పేర్లతో కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. కిరణ్‌కుమార్‌ను ఎవరు ప్రతిపాదించరనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.

మిగిలిన డివిజన్లకూ నియామకం
జిల్లాలోని పలు డివిజన్లకు ఇన్‌ఛార్జి డీవైఈఓలను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వచ్చాయి. బాపట్ల- రవిసాగర్‌, నరసరావుపేట - సుధాకర్‌రెడ్డి, సత్తెనపల్లికి డీఈఓ గంగాభవానీ, జడ్పీ డీవైఈవోగా ఏడీ-1 సంధాని, ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓగా ఎస్‌ఎస్‌ఏ పీఓ వెంకటప్పయ్యలను నియమించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని