మంట నూనె..!
eenadu telugu news
Updated : 26/10/2021 05:37 IST

మంట నూనె..!

గతేడాదితో పోలిస్తే కిలోకు రూ.50 పెరుగుదల
ఈనాడు-అమరావతి

వంట నూనెల ధరలు సలసలమంటున్నాయి. గతేడాది అక్టోబరు ధరలతో పోలిస్తే ఈ ఏడాది ఆరు రకాల వంట నూనెల ధరలు 50 శాతం పెరిగాయని మూడు రోజుల కిందట కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ వెల్లడించింది. మొత్తంగా ఇది ప్రజలను బెంబేలెత్తిస్తోంది. సగటు జీవి అల్లాడిపోతున్నాడు. కేవలం ఒక ఏడాదిలోనే నూనెల ధరలు 50 శాతం పెరగటం అంటే అది సగటున ప్రతి ఇంటి వంటింటి బడ్జెట్‌ తల్లకిందులు అయినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావం ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏడాదిలో రూ.వేల కోట్లలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

12.96 లక్షల కుటుంబాలపై ప్రభావం
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 48 లక్షలు. కుటుంబాల పరంగా చూస్తే 12,96,609 ఉన్నాయి.  అన్ని రకాల వంటనూనెలు కలిపి సగటున రోజువారీ విక్రయాలు జిల్లాలో 100 టన్నుల దాకా ఉంటాయని వ్యాపారవర్గాలు తెలిపాయి.  గుంటూరు, నరసరావుపేట, తెనాలి వంటి ప్రధాన పట్టణాల్లోనే మొత్తం వినియోగంలో 60 శాతం ఉంటోంది. సన్‌ఫ్లవర్‌, వేరుసెనగ, పామాయిల్‌ తదితర అన్ని రకాల నూనెల విక్రయాల సగటున రోజుకు రూ.14కోట్లు దాకా ఉంటుందని వ్యాపారవర్గాల అంచనా. ప్రస్తుతం సగటున కిలో నూనె ధర రూ.140 ఉంది. అదే ఏడాది కిందట అది రూ.90కు లభ్యమైందని హోల్‌సేల్‌ వ్యాపారి ఒకరు చెప్పారు.

70 శాతం దిగుమతి
మనకు విదేశాల నుంచే 70 శాతం మేర నూనెలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల ప్రభావం ఎలా ఉందో నూనెల్లోనూ అదే కనిపిస్తోంది. పెరుగుదలకు కచ్చితమైన కారణాలు  ఎవరూ చెప్పలేకపోతున్నారు. గడిచిన 25 ఏళ్ల నుంచి నూనెల వ్యాపారంలోనే ఉన్నా.. గత ఏడాది నుంచి పెరిగిన ధరలు తన 25 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని పట్నంబజార్‌కు చెందిన హోల్‌సేల్‌ డీలర్‌ ఒకరు తెలిపారు.


ప్రజలపై అదనపు భారం

వ్యాపార వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే ఏడాది  కిందట కిలో రూ.90 కు లభ్యమైన నూనె ఏడాది నుంచి రూ.140కు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసం ప్రతి కుటుంబంపై పడిన అదనపు భారంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబం నెలకు 2 నుంచి 4 కిలోలు వినియోగిస్తారు. పరిమాణం ఆధారంగా ఆ కుటుంబంపై అదనపు భారం పడినట్టే. ఉదాహరణకు ఏడాది కిందట ఒక కుటుంబం వార్షికంగా రూ.5 వేలు నూనెల కొనుగోలుకు ఖర్చు పెడితే ప్రస్తుతం ధరల పెరుగుదలతో ఆ కుటుంబం రూ.20 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

- ఆచార్య జీవీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వాణిజ్య విభాగం అధిపతి, ఏఎన్‌యూ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని