జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకి
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రామ్మోహన గ్రంథాలయంలో జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకి ఏర్పడింది. దీనికి నగరపాలక సంస్థ అనుమతి ఇవ్వటం లేదని గ్రంథాలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. గ్రంథాలయ కమిటీ ఇక్కడ భారత మాత విగ్రహం, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం, ప్రముఖ సామాజికవేత్త సంత్‌ గాద్గే బాబా, గ్రంథాలయ ఉద్యమనేత అయ్యంకి వెంకట రమణయ్యల విగ్రహాలను ఏర్పాటు చేయాలని తలంచింది. రామ్మోహన గ్రంథాలయం ప్రైవేటు స్థలమైనా విగ్రహాల ఏర్పాటు కోసం నగరపాలకసంస్థ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌ సైతం సంబంధిత ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం విగ్రహాల అనుమతి నగరపాలక సంస్థ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి కోటేశ్వరరావు చెబుతున్నారు.

ఉప రాష్ట్రపతి రాక..
ఈనెల 31న సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో ఈ నాలుగు విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు. ఆయన వస్తానని హామీ ఇవ్వటంతో విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు గ్రంథాలయ కమిటీ నిర్ణయించింది. అయితే నగరపాలక సంస్థ అధికారులు అనుమతిపై మీనమేషాలు లెక్కిస్తుండటంతో నిరాశకు గురైంది. అనుమతులపై మరోసారి అధికారులను కలుస్తామని కమిటీ చెబుతోంది.


అనుమతులు వచ్చిన తర్వాత ఆవిష్కరణ..

ప్రస్తుతం గ్రంథాలయం లోపలే నాలుగు విగ్రహాలను ఉంచాం. ఈనెల 31న ఉప రాష్ట్రపతి విగ్రహాలను ప్రారంభిస్తారు. పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నగరపాలక సంస్థ అనుమతులు ఇచ్చిన తర్వాత గ్రంథాలయం ఆవరణలో విగ్రహాలను పెట్టి ఆవిష్కరిస్తాం.

- చింతలపూడి కోటేశ్వరరావు, రామ్మోహన గ్రంథాలయం కమిటీ అధ్యక్షుడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని