బెట్టింగ్‌ గుట్టు రట్టు
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

బెట్టింగ్‌ గుట్టు రట్టు

బుకీల నుంచి పట్టుకున్న టి.వి., చరవాణులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచ కప్‌ టీ20 క్రికెట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారిపై విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడులు చేశారు. గాంధీనగర్‌, భవానీపురం, సూర్యారావుపేటల్లో పలువురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావటంతో నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.వి.శ్రీనివాసరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టి.వి., ల్యాప్‌టాప్‌, కేబుల్‌ సెటప్‌ బాక్సు, 12 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బెట్టింగ్‌కు సంబంధించి నగదు లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

* సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా రామవరప్పాడుకు చెందిన అడకా రాజేష్‌, బొంతు రాజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బుకీలుగా ఉంటూ మరో 11 మంది పంటర్ల సాయంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ 11 మంది పంటర్లను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

* భవానీపురం కరెంట్‌ ఆఫీస్‌ రోడ్డులో షేక్‌ భుకారే అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెటప్‌ బాక్సు గల టి.వి., ఒక కీ ప్యాడ్‌ ఫోన్‌తో... జీరు రామచిట్టి, షేక్‌ రియాజ్‌ల సాయంతో బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయా పరికరాలతోపాటు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న వందరాసి సురేష్‌ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

* సూర్యారావుపేట పీఎస్‌ పరిధిలో పాము సురేష్‌ అనే వ్యక్తి చరవాణిలో బెట్టింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దాని ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడు ప్రధానబుకీగా పోలీసులు తేల్చారు. ఇతడితో బెట్టింగ్‌ నిర్వహించే పంటర్ల వివరాలు సేకరించాల్సి ఉంది.

యాప్‌ల సాయంతో...
బుకీలుగా వ్యవహరిస్తున్న వారు అత్యధికంగా యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. చరవాణిలో అయితే యాప్‌లు, ల్యాప్‌టాప్‌ల్లో బెట్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో వ్యవహారమంతా నడిపిస్తున్నారు. బెట్టింగ్‌కు సంబంధించి వందలాది యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లు వాటిలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మెరుపుదాడుల్లో టి.వి., ల్యాప్‌టాప్‌, చరవాణులు తప్ప నగదు దొరకలేదు. నగదు లావాదేవీలన్నీ అత్యంత రహస్యంగా చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జనం బెట్టింగ్‌ల ద్వారా రూ.కోట్లలో నగదు పోగొట్టుకుంటున్నా.. పోలీసులకు మాత్రం దొరికేది చాలా తక్కువ అనేది బహిరంగ రహస్యం. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు వి.ఎస్‌.ఎన్‌.వర్మ, జి.వి.రమణమూర్తి, సీఐ కృష్ణమోహన్‌ తమ సిబ్బందితో ఈ దాడులు చేసి, నిందితులను పట్టుకున్నారు. విచారణ నిమిత్తం సంబంధిత పోలీస్‌స్టేషన్లలో అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని