ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం

వివరాలు తెలుసుకుంటున్న తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : గవర్నర్‌పేట రాజగోపాలాచారి వీధిలోని ఘర్‌ సంసార్‌ ఫ్యాన్సీ దుకాణంలో ఆదివారం రాత్రి విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాన్సీ వస్తువులు, కుక్క పిల్లలు, పక్షులు, రంగు రంగుల చేపలు కాలిపోయాయి. ఆదివారం సెలవు కావటంతో దుకాణం మూసి ఉంది. రాత్రి 10.40 గంటల సమయంలో షట్టర్ల కింద నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు, దుకాణం యజమానులకు సమాచారం అందించారు. అప్పటికే మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులు ఉండటంతో ఒక్కసారిగా అంటుకున్నాయి. నల్లని పొగ సుడులు తిరుగుతూ బయటకు వెలువడటంతో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అగ్నిమాపక శాఖకు చెందిన అయిదు వాహనాలు దాదాపు 5 గంటల సేపు నీళ్లు జల్లితే.. తెల్లవారుజామున 4 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. దుకాణం పెద్దది కావడం, లోపలికి వెళ్లే మార్గం ఒక్కటే కావటంతో మంటలను అదుపు చేయటం సిబ్బందికి కష్టమైంది.

మూగజీవాలు సైతం..
ఈ దుకాణంలో ఫ్యాన్సీ వస్తువులతో పాటు రకరకాల పక్షులు, కుక్క పిల్లలు, ఆక్వేరియం చేపలు విక్రయిస్తుంటారు. ప్రమాద సమయంలో కుక్క పిల్లలు, పక్షులున్న పంజరాలు లోపలే ఉన్నాయి. వీటితోపాటు ఆక్వేరియంలో ఉన్న రంగు చేపలు సైతం కాలిపోయాయి. రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లడంతో యజమానులు ఆవేదన చెందుతున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ అయి ఉండొచ్చని అంటున్నారు. దుకాణానికి బీమా లేదని, ఎంత నష్టం జరిగిందో యజమానులు చెప్పలేకపోతున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్‌, తెదేపా ఫ్లోర్‌లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి పరిశీలించి బాధితులను పరామర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని