టీకా వేళ.. వేలిముద్రల హాజరు ఎలా?
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

టీకా వేళ.. వేలిముద్రల హాజరు ఎలా?

ఆరోగ్య కార్యదర్శుల సమస్యలు వింటున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌  

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే తమకు ప్రతి రోజూ రెండుసార్లు వేలిముద్రల హాజరు (బయో మెట్రిక్‌ విధానం) ఎలా సాధ్యమవుతుందని? విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల ఆరోగ్య కార్యదర్శులు (ఎ.ఎన్‌.ఎం.లు) ప్రశ్నించారు. తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. సుమారు 200 మంది సోమవారం సబ్‌కలెక్టర్‌కార్యాలయానికి వచ్చారు. నిత్యం క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌కు విన్నవించారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల కల్లా క్షేత్ర స్థాయి విధులకు వెళుతున్నట్టు తెలిపారు. పండగలు, ఆదివారాల్లోనూ సెలవులు లేవన్నారు. ప్రతి రోజూ 18 గంటల పాటు విధులు నిర్వహించే తమకు రోజుకు రెండుసార్లు వేలిముద్రల హాజరు వేస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎ.ఎన్‌.ఎం. ప్రతినిధులతో సబ్‌కలెక్టర్‌ కూలంకషంగా చర్చించారు. వైద్యాధికారులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఆమె వయసు 12 ఏళ్లట..
నగరంలోని కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్‌కు చెందిన మద్దిల రాజేశ్వరికి 58 సంవత్సరాలు. 2008వ సంవత్సరం నుంచి వితంతు పింఛను పొందుతున్నారు. గత ఏడాదిన్నర నుంచి పింఛను సొమ్ము రావడం లేదు. దీనిపై ఆరా తీస్తే.. తన వయసు 12 సంవత్సరాలుగా నమోదైందని, అందుకే నిలిపివేసినట్టు చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సచివాలయానికి, వీఎంసీకి, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరుగుతున్నట్టు వివరించారు. తాజాగా స్పందనలో మరో అర్జీ దాఖలు చేశారు.

* జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు తండాకు చెందిన భూక్యా కవిత తన రేషన్‌ కార్డును పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వత్సవాయి మండలం లింగాలకు చెందిన మాడగుల వెంకటేశ్వర్లు తన రేషన్‌ కార్డును పునరుద్ధరించి, వృద్ధాప్య పింఛన్‌ వచ్చేలా చూడాలని కోరారు.

* విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడికి చెందిన నజీమ్‌ఖాన్‌ కుమార్తె ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రథమ సంవత్సరంలో అమ్మ ఒడి సొమ్ము జమవగా, రెండో ఏడాది నిలిచిపోయింది. దీనిపై ఆరా తీస్తే ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పుపడినట్టు బదులిచ్చారు. తప్పులు సరిచేసి, పునరుద్ధరించాలని విన్నవించారు.


సాగునీరు అందక తంటాలు..

కంకిపాడు మండలం ప్రొద్దుటూరు ప్రాంతంలోని పొలాలకు సాగు నీరు అందక పోవడంతో, పొట్ట దశలో ఉన్న వరి పైరు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని కొండేటి రామారావు అనే కౌలు రైతు వినతి పత్రం సమర్పించారు. జగ్గయ్యపేట మండలం బూదవాడలో వివిధ అవసరాల నిమిత్తం దళితులు, గిరిజనుల నుంచి భూములు తీసుకున్నారని, 8 సంవత్సరాలైన వారికి ఎలాంటి పరిహారాన్ని ప్రకటించలేదని, వెంటనే ఇప్పించాలని కోరుతూ దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చప్పిడి హనుమంతురావులు వినతి పత్రం అందజేశారు.

* జి.కొండూరు మండలం చెరువు మాధవరం పొలాలను రైల్వే లైను విస్తరణ నిమిత్తం తీసుకుంటున్న క్రమంలో, తమకు నష్టం లేకుండా పరిహారాన్ని ఇప్పించాలని పలువురు రైతులు కోరారు.


90 శాతం అర్జీల పరిష్కారం

టీవల మూడు నెలల కాలంలో స్పందనలో సుమారు 800 వినతులు రాగా, వీటిలో 90 శాతం వరకు పరిష్కరించినట్టు సబ్‌కలెక్టర్‌ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అర్జీల పరిష్కారం విషయమై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. అర్జీదారులతో కూడా మాట్లాడుతున్నట్టు వివరించారు. సోమవారం నాటి స్పందనలో మొత్తం 57 వినతులు అందినట్టు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 22, పౌరసఫరాలకు 3, పోలీసు శాఖకు 5, వీఎంసీకి 8, మిగతా శాఖలకు 19 అర్జీలు వచ్చినట్టు ఆయన వివరించారు. ఏవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని