ఇక్కడ కాదన్నారు.. అక్కడ ఇవ్వనన్నారు!
eenadu telugu news
Updated : 27/10/2021 11:26 IST

ఇక్కడ కాదన్నారు.. అక్కడ ఇవ్వనన్నారు!

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ జీజీహెచ్‌కు వచ్చే రోగులపట్ల ఓపీలో ఉండే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కుక్కకాటు వ్యాక్సిన్‌ కోసమని జీజీహెచ్‌కు వస్తే ఇక్కడ కాదు అక్కడ.. అంటూ 20 నిమిషాలు తిప్పారు. దీంతో ఆమె ఓపిక లేక తన మనవడిని చీటీ కోసం పంపిస్తే మూడు కౌంటర్లలోనూ మహిళలకే ఇస్తామంటూ సిబ్బంది చెప్పారు. ఇక్కడ అలా సూచిక బోర్డులు లేవు కదా? అని నిలదీస్తే అసలు చీటీ ఇవ్వం అంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు 45 నిమిషాలు తరవాత ఓపీ చీటీ సంపాదించుకుని, వృద్ధురాలు కుక్కకాటుకు వ్యాక్సిన్‌ వేయించుకుని వెళ్లారు. అలాగే జగ్గయ్యపేటకు చెందిన 52 ఏళ్ల వృద్ధ్దుడు తల, కంటికి సంబంధించిన సమస్యతో ఆసుపత్రికి వచ్చి ఓపీ చీటీ కోసం గంట పాటు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. అక్కడ పెద్దగా రద్దీ లేకపోయినా సిబ్బంది మాత్రం మాటల్లో మునిగి తేలుతున్నారు. దీనిపై ఆ వృద్ధుడు ప్రశ్నిస్తే వారు దురుసుగా ప్రవర్తించారు. ఆయన గట్టిగా నిలదీయడంతో క్యూలైన్‌లో మిగిలిన వారికి ఓపీ చీటీలు ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు అందడంతో సిబ్బందిని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

పునరావృతం కాకుండా చూస్తాం: డాక్టర్‌ శోభ, ఆర్‌ఎంఓ
సిబ్బందిపై అధిక ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో అలా అని ఉండొచ్చు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రి ఆవరణలో ఉన్న షెడ్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో పురుషులు, మహిళలూ ఓపీ చీటీలు తీసుకోవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని