మూగజీవాల సజీవ దహనంపై ఫిర్యాదు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

మూగజీవాల సజీవ దహనంపై ఫిర్యాదు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : గవర్నర్‌పేట రాజగోపాలాచారివీధిలో ఘర్‌ సంసార్‌ ఫ్యాన్సీ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూగజీవాలు సజీవ దహనంపై హెల్ప్‌ ఫర్‌ యానిమల్స్‌ సొసైటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి అవసరమైన లైసెన్సు లేకుండానే ఘర్‌ సంసార్‌లో పక్షులు, కుక్కపిల్లలు, కుందేళ్లు, చేపలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. అగ్నిప్రమాదంలో మూగజీవాల మరణానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సొసైటీ కార్యదర్శి తేజోవంత్‌ అనుపోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణ యజమానుల చర్యలు 2018 జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, జంతు హింస నిరోధక చట్టం 1960లోని సెక్షన్‌ 11 (1)ఎ, 11 (1)ఇ, 38 (1)కి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. దుకాణంలోని మౌలిక సదుపాయాలు, పెంపుడు జంతువులపై క్రూరత్వ నివారణకు అనుగుణంగా నిబంధనలు లేవన్నారు. అగ్నిప్రమాదాలను నివారించటంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, దీనిపై కేసు నమోదు చేసి వెటర్నరీ అధికారి పర్యవేక్షణలో సజీవ దహనమైన మూగజీవాలకు పోస్ట్‌మార్టం చేయించాలని ఫిర్యాదులో కోరారు.

విశ్వకర్మ గోల్డ్‌ స్మిత్‌ యాజమాన్యం.. ఆదివారం రాత్రి ఘర్‌ సంసార్‌ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో విశ్వకర్మ గోల్డ్‌ స్మిత్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించిన పలు యంత్రాలు కాలిపోయినట్లు సంస్థ ప్రతినిధి ధనాలకోట శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్‌ సంసార్‌ డాబాపై తాము కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌-క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద బంగారపు పని వార్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదంలో తమ సంస్థకు చెందిన పలు యంత్రపరికరాలు పాడైపోయాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పై రెండు ఫిర్యాదులపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని