ప్లాస్టిక్‌ లేని గుంటూరు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

ప్లాస్టిక్‌ లేని గుంటూరు

ఈనాడు, అమరావతి

జరిమానా
నవంబరు 11 నుంచి కవర్లు విక్రయించే వ్యాపారులకు జరిమానాలు విధించాలని యంత్రాంగం నిర్ణయించింది. ప్రజల్లో కూడా మార్పు రావాలని, వారికి నామమాత్రంగా జరిమానాలు విధించాలని భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని ప్రజలు సానుకూలంగా తీసుకోవాలని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని నగరపాలక విజ్ఞప్తి చేస్తోంది.


మార్కెట్‌కు వచ్చేటప్పుడు ఇంటి నుంచే జనపనార సంచులు తెచ్చుకోవాలని, మార్కెట్లోనూ అవి అందుబాటులో ఉండేలా వ్యాపారులు నిల్వలు సిద్ధం చేసుకోవాలని మేయర్‌, కమిషనర్‌ స్పష్టం చేశారు.


తయారీదారులను వదిలేసి తమను విక్రయాలు చేయరాదని సూచించడం తగదని కొందరు వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి కలుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని నగరపాలక తీసుకున్న ఈ నిషేధానికి వ్యాపారులు సహకరించాలని, రెండో అభిప్రాయానికి తావు లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు.

ర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ సంచులను దశలవారీగా నిషేధించడానికి నగరపాలక సిద్ధమవుతోంది. ప్రస్తుతం వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలను రానున్న 15 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 11 నుంచి నగరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ సంచుల వినియోగం లేకుండా ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఒకవేళ వాడాల్సి వస్తే 75 మైక్రాన్ల కన్నా ఎక్కువ బరువున్న వాటినే అనుమతిస్తారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయటంతో నగరపాలక ఈ నిర్ణయం తీసుకుంది. వీటి వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించడానికి సమాయత్తమవుతోంది.

గత 20 రోజుల నుంచి మటన్‌, చికెన్‌ షాపుల వద్దకు ఇంటి నుంచి స్టీలు బాక్సులతో వెళ్లి కొనుగోలు చేస్తే రూ.20 రాయితీ ఇప్పిస్తోంది. ఇది ప్రస్తుతం అమలవుతోంది. కూరగాయ విక్రేతలు, పండ్ల వ్యాపారులు, హోటళ్లు, కర్రీ పాయిట్స్‌ వంటి వాటిల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. వాటి వాడకం నిషేధిస్తే సైడు కాల్వల్లో, చెత్త పడేసే డంపర్‌ బిన్లలో ఇవి కనిపించవని, పర్యవసానంగా పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని యంత్రాంగం సూచిస్తోంది. నగరంలో వస్తున్న ఘన వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ సంచులే సుమారు 30 శాతం ఉంటాయని అంచనా. ఇవి మానవాళికే కాదు.. మూగజీవాలకు నష్టం చేస్తున్నాయి. మిగిలిపోయిన ఆహారం, కూరలు వంటివి ఆ సంచుల్లో పెట్టి రహదారుల పక్కన పడేస్తున్నారు. ఆ సంచులను తిని మూగజీవాలు గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోతున్నాయి.  

సచివాలయాల వారీగా తనిఖీలు
ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న అన్ని రకాల షాపులను నవంబరు 11 నుంచి నిత్యం తనిఖీ చేసేలా సచివాలయ ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నారు. గతంలో కేవలం ప్రజారోగ్య విభాగం మాత్రమే తనిఖీలు చేపట్టేది. ఈ విభాగంలో సరిపడా సిబ్బంది లేక వ్యాపారులు యంత్రాంగం ఆదేశాలు పట్టించుకునేవారు కాదు. పర్యవసానంగా దీని అమలు అనేకసార్లు నీరుగారిపోయింది. ప్రస్తుతం చేతి నిండా తమకు సిబ్బంది ఉన్నారని, కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 207 సచివాలయాల పరిధిలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 2వేల మందికి పైగా ఉన్నారు. వీరంతా షాపులపై నిత్యం తనిఖీలు చేసి వ్యాపారులు వాటి విక్రయాల జోలికి వెళ్లకుండా చర్యలు తీసుకునేలా తనిఖీలకు యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. దీన్ని నగరంలోని ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, అదనపు కమిషనర్‌తో పాటు ప్రజారోగ్య విభాగం ఎంహెచ్‌ఓ పర్యవేక్షిస్తారు.


రాయితీ ధరలకు సంచులు ఇప్పిస్తాం
- అనురాధ, నగరపాలక సంస్థ కమిషనర్‌

నగరంలో 1.87 లక్షల అస్సెస్‌మెంట్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి రాయితీపై క్లాత్‌, జనపనార, కాగితంతో తయారు చేసిన సంచులను అందజేయాలని భావిస్తున్నాం. దీనికి నగరపాలకతో పాటు ఆయా సంస్థల సహకారం తీసుకుంటాం. ఈ సంచుల తయారీ కంపెనీలను సంప్రదిస్తాం. వాటిని సిద్ధం చేసుకోవాలని కోరతాం. ప్రతి దుకాణంలో రాయితీ ధరలకు వాటిని ప్రజలకు అందించేలా వ్యాపారులతో సమావేశం పెట్టి ఆ దిశగా చైతన్యం తెస్తాం. నవంబరు 11 నుంచి నిషేధం కచ్చితంగా అమలవుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని