మొక్కలతో మురుగునీటి శుద్ధి
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

మొక్కలతో మురుగునీటి శుద్ధి

లీటర్‌కు 30 పైసలు మాత్రమే వ్యయం
ఈటీవీ-గుంటూరు

నీటిని స్వచ్ఛంగా మార్చేది ఈ మొక్కల వేర్లే

ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న నీటి వనరులు మానవాళి మనుగడకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో నీటిని పొదుపుగా వాడడంతో పాటు రీసైక్లింగ్‌ పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఖర్చు ఎక్కువనే కారణంతో నీటి పునర్వినియోగంపై ఎవరూ పెద్దగా దృష్టి సారించటం లేదు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం ఈ దిశలో ముందడుగు వేసింది. సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుని విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ నిపుణులు రూపొందించారు. యూనివర్శిటీలో నిత్యం 5లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. గతంలో అదంతా మురుగునీరుగా వెళ్లిపోయేది.

ఓజోనేషన్‌ అనంతరం శుద్ధజలం...

మురుగునీరు మూడు అంచెల్లో స్వచ్ఛంగా మార్చేలా ప్లాంట్‌కు రూపకల్పన చేశారు. గతంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు భిన్నంగా ఇక్కడ గ్రీన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. నీరు పల్లమెరుగు అన్న సామెత మేరకు క్యాంపస్‌ లోని పల్లపు ప్రాంతంలో ప్లాంటు నిర్మించారు. వివిధ చోట్ల ఉపయోగించిన నీరు గ్రావిటీ ఆధారంగానే ప్లాంట్‌కు చేరుకుంటుంది. ఇలా చేరే క్రమంలో నీటిపై తేలియాడే వాటిని వడపోసి బయట పడేస్తారు. ఆ తర్వాత మురుగునీరు ట్యాంకుల్లోకి చేరుతుంది. లక్ష లీటర్ల సామర్థ్యం గల ఏడు ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి నిండిన తర్వాత మరొక దానిలోకి నీరు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నీటిలో బరువు ఎక్కువగా ఉండే లోహాలు, రసాయనాలు అడుగుకు వెళ్లిపోతాయి. ఈ ట్యాంకుల్లో మేలు రకం బ్యాక్టీరియాను వేసి ఉంచుతారు. నీటిలో అడుగుకు చేరిన మలినాల్ని బ్యాక్టీరియా సంగ్రహిస్తుంది. దీంతో మొదటి దశ పూర్తవుతుంది. ట్యాంకుల్లోని నీటిని పైపుల ద్వారా పక్కనే ఉన్న తడి నేలల్లోకి పంపిస్తారు. ఇక్కడ నేలపై దాదాపు 2 అడుగుల మేర కంకరతో నింపారు. అందులో ఏడు రకాల మొక్కలు నాటారు. అవన్నీ కూడా వేర్ల ద్వారా వివిధ రకాల రసాయనాల్ని పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి. ఆ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా గాలిని పంపింగ్‌ చేస్తారు. దీన్ని ఏరియేషన్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియతో నీటిలోని హానికరమైన నైట్రేట్స్‌, సల్ఫేట్స్‌, లెడ్‌ వంటి హానికర పదార్థాలు పోతాయి. సహజ సిద్ధమైన విధానంలో మొక్కల ద్వారా శుద్ధి అయిన నీరంతా ఓపెన్‌ ట్యాంకులోకి చేరుతుంది. ఇక్కడ ఓజోనేషన్‌ చేయటంతో మూడో దశ పూర్తవుతుంది. అప్పటికి నీరు పూర్తి స్వచ్ఛంగా మారిపోతుంది.  

శుద్ధిలో భాగంగా మొదటగా మురుగు వచ్చి చేరే ట్యాంకులను పరిశీలిస్తున్న నిపుణులు


ట్రిపుల్‌ ఆర్‌ ఫార్మూలాతో ప్రాజెక్టు
- డాక్టర్‌ నేరెళ్ల రూబెన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధిపతి

రీ సైక్లింగ్‌, రెడ్యూజ్‌, రీ యూజ్‌ అనే మూడు లక్ష్యాలతో ప్లాంట్‌  పని చేస్తుంది. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానాల్లో విద్యుత్‌ వినియోగం ఎక్కువ. మేం ఇక్కడ అతి తక్కువగా విద్యుత్‌ వాడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ కేవలం ఏరియేషన్‌ ప్రక్రియ కోసం మోటార్లు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా ప్రక్రియలన్నీ సహజసిద్ధంగా జరుగుతాయి. నీటిని ప్లాంటుకు చేర్చటానికి కూడా గ్రావిటీపై ఆధారపడ్డాం. ఇక శుద్ధి ప్రక్రియలో బురద ఏర్పడటం సాధారణం. దాన్ని తొలగించటానికి కూడా ఖర్చు పెట్టాల్సి ఉండేది. మొక్కలతో నీటి శుద్ధి ద్వారా బురద సమస్య లేకుండా చేశాం.


సహజ సిద్ధంగా ప్రక్రియ
- డాక్టర్‌ ఎం.వి. రాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ఈ విధానంలో లీటరు నీటిని శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు 30 పైసలు మాత్రమే. గతంలో రూ.5 వరకూ ఖర్చయ్యేది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల్లో ఇది అత్యుత్తమమైనది. బురదను మొక్కలు తినేస్తాయి కాబట్టి ప్లాంట్‌ వద్ద ఎలాంటి దుర్వాసన ఉండదు. రోజుకు 5లక్షల లీటర్ల నీటని శుద్ధి చేస్తున్నాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్లాంట్‌ ను 7లక్షల లీటర్ల శుద్ధి సామర్థ్యంతో రూపొందించాం. ఓజోనేషన్‌ చేసిన నీటిని తాగేందుకు కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ నీటిని క్యాంపస్‌ లో మొక్కలకు, పక్కనే ఉన్న పొలాల్లో వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని