29న 200 కేంద్రాల్లో బీపీ పరీక్షలు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

29న 200 కేంద్రాల్లో బీపీ పరీక్షలు

మాట్లాడుతున్న రెడ్‌క్రాస్‌ జిల్లా వైస్‌ ఛైర్మన్‌ రామచంద్రరాజు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ఈనెల 29న ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవం సందర్భంగా ఉచితంగా బీపీ పరీక్షలు నిర్వహించనున్నామని రెడ్‌క్రాస్‌ జిల్లా వైస్‌ ఛైర్మన్‌ పి.రామచంద్రరాజు తెలిపారు. జిల్లాపరిషత్తు ప్రాంగణంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఎంఏ, ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌, రెడ్‌క్రాస్‌ సంయుక్తంగా 29న గుంటూరు నగరంలో 200 కేంద్రాల్లో ఉచిత బీపీ పరీక్షలు చేస్తారన్నారు. పక్షవాత నివారణ మాసోత్సవాల సందర్భంగా ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ పి.విజయ ఆధ్వర్యంలో అవగాహన శిబిరాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారని వివరించారు. ‘సంతోష గుంటూరు- ఆరోగ్య గుంటూరు’ నినాదంతో ఈ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. ఐఎంఏ గుంటూరు బ్రాంచి అధ్యక్షుడు డాక్టర్‌ మద్దినేని జగదీశ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సోకిన వారిలో ఎక్కువ మంది రక్తపోటుతో బాధపడుతున్నారన్నారు. 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 29న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుంటూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉచితంగా బీపీ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. చుట్టుగుంట కూడలిలోని ఐఎంఏ భవనంలో మెగా క్యాంప్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బీపీ పరీక్షలు చేసిన తర్వాత ప్రజల ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యులు మందులు రాస్తారన్నారు. ప్రైవేటు వైద్యులు ఉచితంగా సేవలు అందజేసేందుకు సంసిద్ధత తెలియజేశారని వివరించారు. ఇకపై ప్రతి నెలా రెడ్‌క్రాస్‌తో కలిసి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో యూత్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా కన్వీనర్‌ ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ, బ్లడ్‌బ్యాంక్‌ వైద్యాధికారి డాక్టర్‌ భాస్కరరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని