‘కాళ్లు మొక్కుతాం.. పాప ఆచూకీ చెప్పండి’
eenadu telugu news
Updated : 27/10/2021 11:35 IST

‘కాళ్లు మొక్కుతాం.. పాప ఆచూకీ చెప్పండి’

కొవొత్తులు ప్రదర్శిస్తున్న తెదేపా, దళిత సంఘాల నాయకులు, బాలిక కుటుంబ సభ్యులు

పాటిబండ్ల(పెదకూరపాడు), న్యూస్‌టుడే: ‘కాళ్లు మొక్కుతాం.. పాప ఆచూకీ చెప్పండి. మా బిడ్డ ఎక్కడుందో పోలీసులు వెతికిపెట్టాలి.. మమ్మల్ని కనికరించండి’ అంటూ అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి పాటిబండ్ల కీర్తి తల్లిదండ్రులు రమేష్‌, శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక అదృశ్యమై ఏడాదైన సందర్భంగా ఆమె జ్ఞాపకాలు తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. పాటిబండ్ల గ్రామానికి చెందిన కీర్తి అదృశ్యమై ఏడాదైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంగళవారం రాత్రి దళిత సంఘాలు, తెదేపా నాయకులు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పాప అదృశ్యమైన స్థలం నుంచి స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొవొత్తులు పట్టుకుని ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా జిల్లా కార్యదర్శి అర్తిమళ్ల రమేష్‌ మాట్లాడుతూ వైకాపా పాలనలో మహిళలు, చిన్నారులు, దళితులకు రక్షణ కరవైందన్నారు. మాజీ ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ మాట్లాడుతూ దళిత కుటుంబానికి చెందిన బాలిక అదృశ్యమైనా పలకరింపునకు సైతం నోచుకోలేదని ఆక్షేపించారు. రాష్ట్ర హోం మంత్రి దళిత మహిళ అయినప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు బెల్లంకొండ రాంగోపాలరావు, భాష్యం ఆంజనేయులు, నెల్లూరి మల్లి, ఏరువ బాలిరెడ్డి, పాటిబండ్ల బాలయ్య, మైనార్టీ నాయకులు అజ్ముల్లా, మహిళా నాయకులు గంగినేని లీలావతి, ముంతాజ్‌, సరిపూడి కృష్ణకుమారి, గుమ్మడి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని