కార్మిక శాఖ స్థలంలో మట్టి అక్రమ తవ్వకాలు: తెదేపా
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

కార్మిక శాఖ స్థలంలో మట్టి అక్రమ తవ్వకాలు: తెదేపా

మట్టి తవ్వకాలను పరిశీలిస్తున్న నసీర్‌ తదితరులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అధికార వైకాపా నేతలు పంచభూతాలను మింగేస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ విమర్శించారు. కాకుమానువారితోటలోని కార్మిక శాఖ స్థలంలో మట్టి అక్రమ తవ్వకాలను తెదేపా నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వ కార్మిక సంక్షేమ స్థలంలో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ కుమ్మక్కై యథేశ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రెండు రోజులగా ట్రాక్టర్‌ మట్టిని రూ.600కు అమ్ముకుంటున్నారు. మైనింగ్‌ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. బిల్డ్‌ ఏపీ పేరిట ఈ స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే కార్మికులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఈఎస్‌ఐ ఆసుపత్రి, ప్రజలకు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తే జగన్‌ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారు. నగరంలోని రోడ్లకు ఎక్కడా పిడికెడు మట్టి వేయలేని ప్రభుత్వం మట్టి కోసం ప్రభుత్వ స్థలాలను, కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారు’.. అని ప్రశ్నించారు. కలెక్టర్‌, మైనింగ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వైకాపా నేతలు చేస్తున్న తప్పుడు పనులను ఎండగడతామన్నారు. ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు గోళ్ల ప్రభాకర్‌, ఎల్లావుల అశోక్‌, గుడిమెట్ల దయారత్నం, ఉప్పు శ్రీను, కోటేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్‌, జమీర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని