6 కిలోమీటర్లు.. 10 ఏళ్లు
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

6 కిలోమీటర్లు.. 10 ఏళ్లు

పిడుగురాళ్ల బైపాస్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

పిల్లలగడ్డ సమీపంలో నిర్మాణంలో వంతెన

అద్దంకి - నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానంలో ఎంతో కీలకమైనది. ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో పిడుగురాళ్ల పట్టణ సమీపంలో ఆరు కిలోమీటర్ల మేర బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. దశాబ్ద కాలం క్రితం పనులు ప్రారంభించినా నేటికీ పూర్తికాలేదు. అద్దంకి నుంచి నార్కట్‌పల్లి వరకు 212 కిలోమీటర్లు పరిధిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. ఈ రోడ్డు నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారు 2011 సంవత్సరంలో పనులు ప్రారంభించారు. విస్తరణ పనుల్లో భాగంగా పిడుగురాళ్ల పట్టణ సమీపంలో ఆరు కిలోమీటర్ల పరిధిలో బైపాస్‌ నిర్మాణానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. బైపాస్‌ రోడ్డులో అత్యంత కీలకమైనది రైల్వే పైవంతెన. రైల్వే పైవంతెన నిర్మాణ చేయడానికి రైల్వేశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.95 కోట్లు చెల్లించాలి. ఆర్థిక శాఖ నుంచి రైల్వే శాఖ డబ్బులు చెల్లించడానికి క్లియరెన్స్‌ గత ఏడాది ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏడాది కాలం నుంచి రైల్వేశాఖకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో అక్కడ నిర్మాణ పనులు జరగడం లేదు. మరోవైపు ఈ ఏడాది గుంటూరు రోడ్డు వైపు 3.17 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు భూసేకరణ చేశారు. వారికి పరిహారం ఇంత వరకు చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. దీంతో ఆ ప్రాంతంలో కూడా రోడ్డు నిర్మాణం చేయడానికి వీలు లేకుండా పోయింది. పిల్లుట్ల రోడ్డులో నిర్మాణం చేసే వంతెనను శ్లాబ్‌ వరకు పూర్తి చేశారు. మరో వంతెన నిర్మాణ పనులు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. బెల్లంకొండ డొంకరోడ్డు సమీపంలో నిర్మాణం చేసే ఇంకో వంతెన నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెన కూడా శ్లాబ్‌ దశకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేయించి నిర్మాణ పనులు జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

రైల్వేశాఖకు చెల్లించాల్సిన నిధులు, రైతులకు చెల్లించాల్సిన పరిహారం నామ్‌వే ఎక్స్‌ప్రెస్‌ వారు చెల్లించే విధంగా మరో కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరితంగా జరగడానికి ప్రస్తుతం వారు చెల్లించి తరువాత ప్రభుత్వం నుంచి ఆ డబ్బును తీసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని