నిర్లక్ష్యం.. వృథాగా జలం
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

నిర్లక్ష్యం.. వృథాగా జలం

పర్యవేక్షణ కొరవడటంతో సముద్రంలోకి సాగు నీరు

ఈనాడు, గుంటూరు

పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు నుంచి వృథాగా పోతున్న నీరు

నాగార్జునసాగర్‌ కుడికాలువ కింద ఆయకట్టుకు విడుదల చేస్తున్న నీటిపై పర్యవేక్షణ కొరవడటంతో విలువైన సాగు నీరు వృథాగా సముద్రంలోకి చేరుతోంది. కాలువల నుంచి నీటిని పొలాలకు తడులు అందిస్తున్న రైతులు అదనంగా వస్తున్న నీటిని వాగుల్లోకి వదిలేస్తున్నారు. మేజరు కాలువల నుంచి మైనర్లకు విడుదల చేసిన ఎక్కడికక్కడ షట్టర్లు లేకపోవడం, పొలాలకు తడులు అందిన వెంటనే అవసరం లేనప్పుడు షట్టర్లు మూసివేసే పరిస్థితి లేకపోవడం నీటివృథాకు కారణమవుతోంది. క్షేత్రస్థాయిలో పని చేసే లస్కర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో నీటి వినియోగంపై నిర్దిష్టమైన అంచనాలు లేకపోవడంతో వృథాకు అస్కారం ఏర్పడింది. సాగర్‌ నుంచి కుడికాలువకు 9వేల క్యూసెక్కులపైగా తీసుకుని పంటలకు అందిస్తున్నారు. ఇందులో వందల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళుతోంది. అన్ని వాగుల నుంచి వచ్చిన నీరు నల్లమడ వాగులోకి చేరి సముద్రంలోకి చేరుతోంది. అక్టోబరు చివరి వారానికి 60 టీఎంసీల నీరు వినియోగించడంతో పంట ఆఖరులో నీటితడులపై సందిగ్ధం నెలకొంది. నాగార్జునసాగర్‌ ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో కృష్ణా నీటి యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ) ఆదేశాలకు అనుగుణంగా నీటిని వాడుకోవాల్సి ఉంది. సాగర్‌ కుడికాలువకు 132 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే 60 టీఎంసీలు వాడుకోవడంతో రాబోయే జూన్‌ వరకు మిగిలిన 72 టీఎంసీలతో సరిపెట్టుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టి వాడుకోగలిగితే ఆయకట్టుకు భరోసా లభిస్తుందని జలవనరులశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా జలవనరులశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

ప్రతి నీటిబొట్టు కీలకమే..

సాగర్‌ ఆయకట్టు కింద ప్రధాన వాణిజ్య పంట మిర్ఛి డిసెంబరు నుంచి మిర్చి కోతలు మొదలై ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. ఈక్రమంలో జనవరి నుంచి నెలకు మిర్చి పంటకు రెండు తడులు అవసరం. ఫిబ్రవరి నుంచి ఎండలు పెరగడంతో ఒక్కొక్క తడికి అవసరమయ్యే నీటి పరిమాణం పెరుగుతుంది. నీటినష్టాలు ఎక్కువగా ఉండటంతో కాలువలకు పూర్తిస్థాయిలో విడుదల చేస్తేనే ఆయకట్టు చివరి పొలాలకు సాగునీరు అందుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాలువ కింద మాగాణి పంట అయిన వరికి నవంబరు, డిసెంబరు నెలలో కీలకదశకు చేరుకునే నేపథ్యంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. పొలాలకు అవసరం లేనప్పుడు కాలువలకు కట్టేయాలని సంబంధిత యంత్రాంగానికి చెప్పడం, వృథా కాకుండా అవసరాల మేరకు మాత్రమే కాలువల నుంచి నీటిని వాడుకుని యంత్రాంగానికి సహకరించాలి.

పరస్పర సహకారంతో వృథాకు అడ్డుకట్ట

సాగర్‌ కాలువల కింద నీటివృథాకు అడ్డుకట్ట వేయాలంటే జలవనరులశాఖ ఇంజినీర్లతోపాటు రైతుల సహకారం తప్పనిసరి. మెట్ట పంటలు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు అందుకు అనుగుణంగా నీటి విడుదల తగ్గించాలి. వరి పొలాల నుంచి వృథాగా నీరు వాగుల్లోకి ప్రవహిస్తోంది. దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాలంటే రైతులు సహకరించాలి. ఇప్పుడు కోల్పోయే ప్రతి నీటిబొట్టుకూ పంట చివరిదశలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మిర్చి పంటకు ఆఖరులో ఒక తడి అందిస్తే 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఈసారి మిర్చి సాగు ఆలస్యంగా ప్రారంభమైనందున పంట కాలం పెరిగే అవకాశముంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాగుల్లోకి వృథాగా వెళుతున్న నీటికి అడ్డుకట్ట వేయాల్సిన తరుణమిదే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని